Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంత తొంద‌రెందుకు? మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి: సీజేఐ

అంత తొంద‌రెందుకు? మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి: సీజేఐ
విజయవాడ , బుధవారం, 18 ఆగస్టు 2021 (15:08 IST)
నూతన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై మీడియా కథనాల పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారిక ప్రకటనకు ముందే నియామకాల గురించి కథనాలు రావడం వల్ల అవాంఛనీయ ఫలితాలు వస్తాయన్నారు. ఇటువంటి వార్తలను రాసేటపుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను కోరారు. జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ సందర్భంగా బుధవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అత్యంత పవిత్రమైనదని దీనికి సముచిత గౌరవం ఉందని తెలిపారు.

ఈ విషయాన్ని మీడియా అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి బాధ్యతారహితమైన రిపోర్టింగ్, ఊహాగానాల వల్ల ప్రతిభావంతుల కెరీర్‌కు విఘాతం కలిగిన ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఈ పరిణామాలు చాలా దురదృష్టకరమని, తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఇటువంటి ముఖ్యాంశంపై ఊహాగానాలు చేయకుండా మెజారిటీ సీనియర్ జర్నలిస్టులు, మీడియా హౌస్‌లు ప్రదర్శించిన పరిపక్వతను, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. నూతన న్యాయమూర్తుల నియామక ప్రక్రియ జరుగుతోందని, సమావేశాలు జరుగుతాయని, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.

మీడియా స్వేచ్ఛను, వ్యక్తుల హక్కులను సుప్రీంకోర్టు ఎంతో గౌరవిస్తుందని, ఈ వ్యవస్థ సమగ్రత, హుందాతనాలను అందరూ కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇదిలావుండగా, సీజేఐ ఆగ్రహానికి కారణం తాజాగా మీడియాలో వచ్చిన కథనాలు. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమించేందుకు సిఫారసు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. జస్టిస్ బీవీ నాగరత్న, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ తదితరులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫారసు చేసినట్లు మీడియా పేర్కొంది. వీరిలో జస్టిస్ బీవీ నాగరత్న 2027లో భారత ప్రధాన న్యాయమూర్తి కావచ్చునని, అదే జరిగితే ఆమె భారత దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టిస్తారని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఫ్ఘానిస్తాన్ అల్లకల్లోలం: బహిరంగంగా మహిళల నిరసన