అక్రమాలను ఎత్తి చూపితే...అన్యాయంగా అరెస్టులు చేస్తారా? ఇదేం రాజారెడ్డి రాజ్యాంగమా? దేవినేని ఉమకు ఏదైనా జరిగితే... ఖబడ్దార్! అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహచరుడు, మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడాన్ని అమానుషంగా చంద్రబాబు అభివర్ణించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ శివారులోని గొల్లపూడిలో దేవినేని ఇంటికి వచ్చిన చంద్రబాబు, ఉమ భార్య పిల్లలతో మాట్లాడారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిజనిర్ధారణకు వెళ్లి మాజీ మంత్రి ఉమ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి ధైర్యం అందించేందుకు తాను వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.
దేవినేని ఉమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, భయపడాల్సిన పని లేదని బాబు ధైర్యం చెప్పారు. దేవినేని ఉమ తండ్రి, భార్య, పిల్లలను ఆయన పరామర్శించారు. చంద్రబాబుతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని నాని, జడ్పీ ఛైర్పర్సన్ అనూరాధా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
చంద్రబాబు రాక సందర్భంగా గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉమ ఇంటి వద్దకు చేరుకున్నారు. దేవినేని ఉమకు ఏదైనా జరగరానిది జరిగితే సహించేది లేదని కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి దేవినేని ఉమను త్వరగా విడిపించాలని టీడీపీ అధినేతను కోరారు.