మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రమైన ఛాతి నొప్పితో మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు.
అనంతరం వైద్యుల బృందం దగ్గుబాటి వేంకటేశ్వరరావుకి యాంజియోప్లాస్టి నిర్వహించి గుండెకు రెండు స్టెంట్లు వేశారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆరోగ్యం కుదుట పడుతున్నట్టు అపోలో వైద్యులు మంగళవారం రాత్రి వెల్లడించారు.
కాగా.. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అపోలో ఆసుపత్రికి వెళ్లి దగ్గుబాటిని పరామర్శించారు. దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరిని, వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.