Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

48 గంటలు కంటిమీద కునుకు లేదు.. 73 యేళ్ల వయసులోనూ స్థిరచిత్తంతో చంద్రబాబు

Advertiesment
chandrababu naidu
, సోమవారం, 11 సెప్టెంబరు 2023 (09:21 IST)
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో అవినీతి చోటుచేుసుకుందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై కేసు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే, అరెస్టు, కోర్టులో హాజరుపరచడం, రిమాండ్‌కు పెద్ద హైడ్రామానే సాగింది. శనివారం వేకుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 24 గంటల సమయం మరో రెండు మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా చంద్రబాబును కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ 24 గంటల సమయంలో సీఐడీ పోలీసులు ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారింది. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనను రోడ్డు మార్గంలో ఏకంగా 320 కిలోమీటర్లు ప్రయాణించేలా చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు 48 గంటల పాటు నిద్రలేకుండా చేశారు. 73 ఏళ్ల వయసులోనూ.. అంతటి ఒత్తిడి కూడుకున్న వాతావరణంలో చంద్రబాబు స్థిరచిత్తం ప్రదర్శించారు. తన బాధ్యతగా అధికారులకు సహకరించారు. 
 
45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్టయిన సందర్భాలు గతంలో ఉన్నా పోలీసులు ఆయనను వెంటనే విడిచిపెట్టేవారు. కానీ, ఈ దఫా అందుకు భిన్నంగా ఉంది. శుక్రవారం నంద్యాలలో అర్థరాత్రి దాటాక పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు దాదాపు ఆ రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా చేశారు. శనివారం ఉదయం 6.15 గంటలకు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత 320 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం రాత్రంతా విచారణ కోసం చంద్రబాబు తాడేపల్లి సిట్ కార్యాలయంలో ఉంచారు. అనంతరం, ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో, పూర్తిగా రెండు రాత్రుల పాటు చంద్రబాబు కంటి మీద కునుకే లేకుండా పోయింది. 
 
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు 45 నిమిషాల పాటు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బంది చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టయ్యానన్న ఆందోళన కనిపించకుండా వారితో ఫొటోలు దిగారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఫర్వాలేదని, తాను బాగానే ఉన్నానని బాబు బదులిచ్చారు.
 
ఇక న్యాయస్థానంలో విచారణ సందర్భంగానూ చంద్రబాబు కోర్టు హాలులోనే గడిపారు. మీరు విశ్రాంతి తీసుకుంటారా? అని జడ్జి అడిగినప్పుడు అక్కడే ఉంటానని చంద్రబాబు బదులిచ్చారు. అంతకుమునుపు చంద్రబాబు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఇక తీర్పు వాయిదా వేసిన సమయంలోనూ ఆయన కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. అలా.. ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఏపీ సీఐడీ పోలీసులు పలు విధాలుగా వేధించినప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా, ఒత్తిడికి గురికాకుండా దృఢచిత్తంతో ఉండటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు అరెస్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691...