విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ నేతల మధ్య పంచాయితీ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరు ఏడాదిగా ప్రచారంలో ఉంది.
మరోవైపు టీడీపీ మేయర్ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని, అధినేత చంద్రబాబు ఎవరిని నిర్ణయిస్తే వారికే తాము మద్దతు ఇస్తామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా రెండు రోజుల క్రితం బాహాటంగానే ప్రకటించారు. మరో ఇద్దరు నేతలు కూడా తమతమ నియోజకవర్గంలోని కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లు తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
నిన్నటి వరకూ కేశినేని శ్వేత ఒక్కరి పేరు ప్రచారంలో ఉండగా, తాజాగా మరో ఇద్దరి పేర్లు తెరపైకి రావడం, అసలు మేయర్ అభ్యర్థినే అధినేత ఖరారు చేయలేదని ఇద్దరు సీనియర్లు ప్రకటించడం పార్టీకి నష్టం చేకూర్చే అంశంగా సీనియర్లు భావిస్తున్నారు.
ఈ వ్యవహారంపై పెద్దలు దృష్టిసారించి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించినట్టు సమాచారం.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నేడో, రేపో బెజవాడ టీడీపీ నాయకులను పిలిచి మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.