సర్వే చేయించి అవార్డులిచ్చివుంటే బాగుండు : చంద్రబాబు
బాలల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తీవ్రస్థాయిలో వివాదం జరుగుతోంది. ఈ వివాదానికితోడు, ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు
బాలల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తీవ్రస్థాయిలో వివాదం జరుగుతోంది. ఈ వివాదానికితోడు, ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసేలా ఉన్నాయి. నంది అవార్డులపై రచ్చ చేసేవారంతా 'నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్' అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది సరికొత్త వివాదానికి దారితీసింది.
ఈనేపథ్యంలో నంది అవార్డులపై వస్తోన్న వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం అమరావతిలో పలువురు మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రతి విషయానికి కులం రంగు పులిమి చూస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా జరుగుతుందని అనుకుంటే సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవారమన్నారు.
నంది అవార్డుల విషయంపై ఇంతగా రచ్చ జరుగుతుందని అనుకోలేదని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం ప్రకారమే జ్యూరీ సభ్యులను నియమించి అవార్డు విజేతలను ఎంపిక చేశామన్నారు. అయితే, మంచి చిత్రాల ఎంపికలో జరిగిన చిన్న పొరపాట్లే ఈ వివాదానికి కారణంగా మారిందన్నారు. ఇదేవిషయంపై జ్యూరీ సభ్యులను సంప్రదిస్తే, సినిమాలు చూసి విజేతలను ప్రకటించామన్నారు.
తమ సంతృప్తి మేరకు నిర్ణయాలు తీసుకున్నట్టు తనకు చెప్పారని తెలిపారు. వారిపై నమ్మకంతోనే జాబితాను ఆమోదించాను. ఇలా వివాదం చేస్తారని భావించలేదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరి ఫోన్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేయించి దాని ప్రకారం అవార్డులు ఇస్తే గొడవ ఉండేది కాదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.