ఈ వయసులో జైల్లో ఉంచి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయగా, ఆయనకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఆయన్ను శుక్రవారం వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జైలు అధికారులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటూ చంద్రబాబును జడ్జి ప్రశ్నించారు.
దీనికి చంద్రబాబు స్పందిస్తూ, జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన హక్కులను రక్షించాలని.. న్యాయాన్ని కాపాడాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రిమాండ్ ముగియడంతో పోలీసులు ఆయన్ను వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీపై న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు.
'45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది. నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్టు చేశారు. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అన్యాయంగా అరెస్టు చేశారు. ఇది నా బాధ.. నా ఆవేదన.. నా ఆక్రందన. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే .. చట్టాన్ని గౌరవిస్తా. న్యాయం గెలవాలి' అని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు.