చంద్రబాబు బీజేపీని నిందించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు: అమిత్ షా
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కోర్టు నోటీసులు వెనుక బీజేపీ ఉందనేది పచ్చి అబద్ధం అని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు చంద్రబ
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు కోర్టు నోటీసులు వెనుక బీజేపీ ఉందనేది పచ్చి అబద్ధం అని అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీని నిందించి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కేసు విషయంలో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని అన్నారు.
చంద్రబాబు మాటలు నమ్మేయడానికి ఆంధ్రా ప్రజలు అంత అమాయకులేమీ కాదని అమిత్ షా అన్నారు. చంద్రబాబుకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేయడానికీ, బీజేపీకి సంబంధం లేదని షా స్పష్టం చేశారు. కేసు నమోదైన సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని షా గుర్తుచేశారు. బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన సందర్భంగా తనపై కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రస్తుతం అంటకాగుతున్నారని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
2010లో మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే చంద్రబాబుపై కేసు పెట్టిందని షా తెలిపారు. 2013లో పోలీసులు ధర్మాబాద్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు 37సార్లకు పైగా సమన్లు జారీ చేశాక కూడా వెళ్లకుండా వుంటే నాన్ బెయిలబుల్ వారంట్ కాకుండా ఇంకేం వస్తుందని చంద్రబాబుపై షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.