ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోని మొట్టమొదటి టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ (డిఎన్‌సి)ను ప్రారంభించారు. 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సిలు), 92 గ్రామ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించబడిన టాటా డిఎన్‌సి 12 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.
ఇంకా రోగుల ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. ఈ సెంటర్ నియోజకవర్గం అంతటా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వనరులను ఏకీకృతం చేస్తుంది. డిజిటల్ సాధనాలు, ప్రామాణిక ఆరోగ్య ప్రోటోకాల్‌ల ద్వారా సంరక్షణను మెరుగుపరుస్తుంది.
తద్వారా సకాలంలో రోగ నిర్ధారణ, కౌన్సెలింగ్, తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం.. ఇంకా పీహెచ్‌సీలలో వర్చువల్ స్పెషలిస్ట్ యాక్సెస్‌ను హామీ ఇస్తుంది. మొదటి విడతగా కుప్పంలో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. రెండవ దశలో చిత్తూరు జిల్లా, మూడవ దశలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని విస్తరించనున్నట్లు ఏపీ సర్కారు ఓ ప్రకటనలో వెల్లడించింది.
మరోవైపు బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు ఎటువంటి హాని జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, "బనకచర్ల ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. హాని కలిగించదు. తెలంగాణ గోదావరి నీటిపారుదల ప్రాజెక్టులను నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. సముద్రంలోకి ప్రవహించే 2,000 టిఎంసి నీటిలో 200 టిఎంసిలను ఉపయోగించడం ద్వారా, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి." అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.