టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి ఒక విజనరీ లీడర్‌ను అరెస్టు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని హీరో విశాల్ ప్రశ్నించారు. ఆయన నటించిన తాజా చిత్రం "మార్క్ ఆంటోనీ". ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుకలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఇందులో పాల్గొన్న విశాల్.. చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు గొప్ప నాయకుడన్నారు. అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు పరిస్థితిని చూస్తే నాకే భయం వేస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీగల నేత అని కొనియాడారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తుందన్నారు. చంద్రబాబు అరెస్టు బాధాకరమని, ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు.
కాగా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించిన విషయం తెల్సిందే. తన మిత్రుడు గొప్ప పోరాటయోధుడని, ఆయన ఎలాంటి తప్పు చేయరని అన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. చంద్రబాబును ములాఖత్‌లో కలవాలని అనుకున్నానని, కానీ కుటుంబ ఫంక్షన్ కారణంగా కలుసుకోలేక పోయినట్టు చెప్పిన విషయం తెల్సిందే.