Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఎలుక మీద కోపంతో ఇంటికి నిప్పు పెట్టారు'.. ఇది పాత సామెత : ఇపుడు ఎలుకే ఇంటికి...

'ఎలుక మీద కోపంతో ఇంటికి నిప్పు పెట్టారు'.. ఇది పాత సామెత : ఇపుడు ఎలుకే ఇంటికి...
, గురువారం, 20 ఆగస్టు 2020 (22:39 IST)
ఎలుక మీద కోపంతో ఇంటికి నిప్పుపెట్టుకున్నారంట అన్నది పాత సామెత. పెద్దలు పదే పదే ఈ సామెతను వల్లెవేస్తుంటారు. కానీ, కాలం మారిపోయింది. ఫలితంగా ఈ సామెత కూడా తిరగబడింది. ఇపుడు ఎలుకే ఏకంగా ఇంటికి నిప్పుపెట్టింది. ఫలితంగా కోటి రూపాయలకు పైగా నష్టంవాటిల్లింది. ఈ విషయం ఓ ఫోరెన్సిక్ సంస్థ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. 
 
ఈ అగ్నిప్రమాద ఘటన వివరాలను పరిశీలిస్తే, గత ఫిబ్రవరి నెల 8వ తేదీన హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో మూడు కార్లు, ఫర్నీచర్ తగలబడడంతో రూ.1 కోటికి పైనా నష్టం జరిగినట్టు సదరు కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కేసు మూసేశారు. అయితే ఆ రోజు రాత్రి సీసీటీవీని క్షుణ్ణంగా పరీక్షించిన ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ .. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది కళ్లకు కట్టినట్టు బయటపెట్టింది. 
 
ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూజ కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించినట్టు సీసీఫూటేజిలో కనిపించింది. గదిలో అంతగా గాలి వీయకపోవడం వల్ల ఆ దీపం రాత్రి  వరకు వెలుగుతూనే ఉంది. రాత్రి 11:51 సమయంలో కస్టమర్ సర్వీస్ రూంలోని ఓ టేబుల్‌పై ఎలుక తచ్చాడుతూ కనిపించింది. 11:55కి ఆ ఎలుక ఏదో నిప్పులాంటి వస్తువు పట్టుకుని తిరిగింది. అంతలోనే దాన్ని తీసుకెళ్లి ఓ కుర్చీ దగ్గర వదిలేసింది. 
 
బహుశా పూజ కోసం దీపంలో వెలిగించిన వొత్తిని లాక్కొచ్చినట్టు భావిస్తున్నారు. కుర్చీలో పడిన కొద్ది నిమిషాలకు.. అంటే 12:06కి ఆ నిప్పు రగులుకోవడం, మంటలు రేగడం జరిగిపోయింది. చూస్తుండగానే పెద్దఎత్తున అగ్నికీలలు కింది ఫ్లోర్‌లోకి ప్రవేశించాయి. 
 
ఆఫీస్ ఫర్నీచర్‌తో పాటు అక్కడ రిపేర్ కోసం ఉంచిన కార్లను కూడా బుగ్గిచేసేశాయి. అదన్నమాట అసలు సంగతి. సో.. కారు సర్వీసు సెంటరుకు ఎలుకే నిప్పుపెట్టినట్టు ట్రూత్ ల్యాబ్ ఫోరెన్సిక్ సంస్థ తేల్చింది. దీంతో ఆ సెంటర్ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా విస్తుపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతికూలంగా ముగిసిన బెంచిమార్కు సూచీలు, 390 పాయింట్లకు పైగా తగ్గిన సెన్సెక్స్