వైకాపా సీనియర్ నేత, మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుసయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి వద్ద సీబీఐ అధికారులు సర్వే చేశారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు.
అదేసమయంలో వివేకా పీఏ ఇనయతుల్లాను మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటితో పాటు ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తదితరుల ఇళ్ళ వద్ద కూడా సర్వే నిర్వహించి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించారు.
ఇందుకోసం మంగళవారం ఉదయం 10.30 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి ఇనయతుల్లాను సీబీఐ అధికారులు పిలిపించి విచారించారు. ఆ తర్వాత ఇనయతుల్లాతో పాటు ప్రభుత్వ సర్వేయరు, వీఆర్పో, ప్రైవేట్ ఫోటోగ్రాఫర్‌లను సీబీఐ అధికారులు వెంటబెట్టుకుని పలు ప్రాంతాల్లో కలియతిరిగారు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇంటి బయట సర్వే చేశారు. అలాగే, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి బయట, ఈసీ గంగిరెడ్డి పాత ఆస్పత్రి వద్ద సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, భరత్ యాదవ్, ఈసీ గంగిరెడ్డి, రంగన్న ఇళ్లు వైకాపా కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సర్వే నిర్వహించారు.