మాజీ ఐపిఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ ఆలోచనా విధానం మారుతోందా. ఒకసారి సొంత పార్టీ అంటారు.. మరోసారి లోక్ సత్తా పార్టీలో చేరేందుకు సిద్థమవుతారు.. అసలు లక్ష్మీనారాయణ సొంత పార్టీ పెట్టకుండా ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా..? జెడి రాజకీయ దోబూచులు ఆడుతున్నారా?
లక్ష్మీనారాయణ. ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సిబిఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణను ఇప్పటికీ అందరూ జెడి లక్ష్మీనారాయణ అనే పిలుస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు గాలిజనార్థన్ రెడ్డి అక్రమాస్తులపై విచారణ జరిపి దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చల్లో నిలిచారు. ఆ తరువాత మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారిగా వెళ్ళిపోయారు.
కొన్ని నెలలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న సమస్యలను గమనిస్తూ వచ్చారు లక్ష్మీనారాయణ. అందుకే రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న నిర్ణయానికి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎపిలోని 13 జిల్లాల్లో తిరిగిన లక్ష్మీనారాయణ ఆ తరువాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. మొదట్లో జెడి లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఉన్న ఏదో ఒక పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ ఆయన సొంత పార్టీనే పెడుతానని ప్రకటించారు. దీంతో అప్పట్లో లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై సందిగ్థం వీడింది.
ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ వేదికగా రాజకీయ పార్టీ ప్రకటించేందుకు సిద్థమయ్యారు జెడి లక్ష్మీనారాయణ. జనధ్వని అనే పేరును కూడా ఫిక్స్ చేసుకున్నారు. మాజీ ఐఎఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ మధ్యలో తన పార్టీలోకి జెడిని ఆహ్వానించారు. దీంతో ఆలోచనలో పడిపోయారు లక్ష్మీనారాయణ. ప్రస్తుతమున్న పార్టీలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెబితే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారని ఆలోచించడం ప్రారంభించారు. దీంతో రాజకీయ పార్టీ పేరును ప్రకటించడం మానుకున్నారు.
రెండురోజుల పాటు మళ్లీ సమాచాలోచనలో పడ్డారు. తన స్నేహితులు, సన్నిహితులు అందరితోను చర్చలు జరిపారు. తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఈ సారి సొంతంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు లక్ష్మీనారాయణ. ఒక ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేసి తాను సొంతంగానే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ లాంటి వ్యక్తిని దూరం చేసుకోకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం లక్ష్మీనారాయణ తీసుకున్నట్లు భావిస్తున్నారు విశ్లేషకులు. జయప్రకాష్ నారాయణ్, జె.డి.లక్ష్మీనారాయణల మధ్య ఇదే విషయంపై వాగ్వాదం కూడా జరిగినట్లు తెలుస్తోంది. శుభమా అంటూ పార్టీ పెట్టుకోవడానికి వెళితే అడ్డంగా వెళ్ళి తమ పార్టీలోకి రమ్మని పిలవడంపై జెడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ పైన అసహనం వ్యక్తం చేశారట.