Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదా... పవన్ వెంట పరుగులు తీయడానికి తిరుపతి విద్యార్థులు రెడీ

ప్రత్యేక హోదా.. ఒక్కసారిగా ఉప్పెనలా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చిన ఉద్యమం. తమిళనాడులో జల్లికట్టుకు ఆర్డినెన్స్‌ను తెచ్చుకున్న తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదా ఉద్యమం. అదే స్ఫూర్తితో, అదే తరహాలో నడవడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాలని పిల

ప్రత్యేక హోదా... పవన్ వెంట పరుగులు తీయడానికి తిరుపతి విద్యార్థులు రెడీ
, బుధవారం, 25 జనవరి 2017 (17:05 IST)
ప్రత్యేక హోదా.. ఒక్కసారిగా ఉప్పెనలా ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చిన ఉద్యమం. తమిళనాడులో జల్లికట్టుకు ఆర్డినెన్స్‌ను తెచ్చుకున్న తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదా ఉద్యమం. అదే స్ఫూర్తితో, అదే తరహాలో నడవడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు సినీనటుడు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌. దీంతో అంతవరకు సైలెంట్ ఉన్న ప్రత్యేక హోదా అంశం మళ్ళీ రాజుకుంది. విద్యార్థులందరు ఐక్యమై ఉద్యమానికి సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు.  ప్రస్తుతం పోలీసుల పర్మిషన్లు లేకపోయినా విద్యార్థులు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నారు.
 
జల్లికట్టు తమిళనాడులో సాంప్రదాయ క్రీడ. ఈ క్రీడ అంటే తమిళ ప్రజలకు ఎంతో ఇష్టం. అందుకే జల్లికట్టుపై నిషేధం పెడితే వారంరోజుల పాటు చెన్నై మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగి కేంద్రం మెడలు వంచి సాధించుకున్నారు. దీంతో తెలుగు ప్రజల్లోను ఉక్రోశం పుట్టుకొచ్చింది. ఏదైనా చేయాలన్న ఆలోచన తట్టింది. ప్రత్యేక హోదా కోసం ముందుకు నడవాల్సిన అవసరం ఉందని అడుగులు వేశారు. ఆ అడుగుకు పవన్‌ కళ్యాణ్‌ తోడవ్వడానికి సిద్ధమయ్యారు. వైజాగ్‌ బీచ్‌, విజయవాడ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలలో రేపు ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు జరుగనున్నాయి. అయితే ఆందోళనలు జరుగకుండా అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు పోలీసులు.
 
అయినా సరే మన హక్కును సాధించుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, పోరాటం చేసి తీరుతామని పవన్ కళ్యాణ్‌ పిలుపునిస్తున్నారు. దీంతో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రం పవన్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి నిరంతరాయంగా హోదా కోసం పోరాటం చేయనున్నారు. ఎస్వీ యూనివర్సిటీ అంటే గతంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలలోనే పోరాటం తీవ్రస్థాయిలో జరిగిందంటే అది ఒక్క ఎస్వీ యూనివర్సిటీలోనే. అయితే ప్రస్తుతం పవన్ వెంట విద్యార్థులు నడవడం, ఆందోళన చేస్తారని తెలియడంతో పోలీసుల్లో భయం పట్టుకుంది. మొత్తానికి ప్రత్యేక హోదా ఉద్యమం ఏ స్థాయికి వెళుతుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామమందిర నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తి చేయలేం: యూపీలో బీజేపీ