Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: తెదేపా అధినేత చంద్ర‌బాబు

బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: తెదేపా అధినేత చంద్ర‌బాబు
, శనివారం, 2 మే 2020 (15:22 IST)
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 327 వ ఆరాధనా ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులకు, బ్రహ్మంగారి భక్తులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

సజీవ సమాధి పొందిన రోజు శనివారం బ్రహ్మం గారి ఆరాధనలు లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లల్లోనే భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు. ‘‘బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని.. ఆధ్మాత్మిక వేత్త, సంఘ సంస్కర్త, గొప్ప తత్వవేత్త... తన బోధనల ద్వారా జాతిని జాగృతం చేశారు.

భోగ భాగ్యాల కన్నా, సమాజ హితమే మిన్నగా బోధించారు. కులాధిక్యతను ఖండించారు, మత మౌఢ్యాన్ని నిరసించారు. పరమత సహనం, శాంతియుత సహజీవనం, సర్వమానవ సౌభ్రాతృత్వం చాటిచెప్పారు.బ్రహ్మంగారి బోధనలు ప్రాత: స్మరణీయం. సర్వ మానవాళికి అనుసరణీయంగా’’ పేర్కొన్నారు. 
 
బ్రహ్మంగారి మఠం అభివృద్దికి టిడిపి కృషి.. 
‘‘బ్రహ్మంగారు అంటే ఎన్టీఆర్ కు ఎంతో గౌరవాభిమానాలు. బ్రహ్మంగారి జీవిత చరిత్రపై ఆయన తీసిన సినిమా ‘‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’’ గొప్ప సక్సెస్. పల్లెటూళ్లనుంచి ఎడ్లబండ్లు కట్టుకుని మరీవచ్చి ఆ సినిమా చూడటానికి పల్లె ప్రజలు పోటీబడటం తెలిసిందే.

కడప జిల్లా కందిమల్లయ్యపల్లి లో బ్రహ్మంగారు సజీవ సమాధి పొందిన ప్రాంతం. ‘‘బ్రహ్మంగారి మఠం’’ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక చర్యలు-పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ది-తెలుగుగంగ పథకంలో భాగంగా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ అభివృద్ది చేశాం. రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించామని’’ గుర్తు చేశారు. 
 
కాలజ్ఞానంలో సూక్తులు అక్షర సత్యాలుగా నేటికీ నిరూపితం..
‘‘కాలజ్ఞానం’’లోని బ్రహ్మంగారి సూక్తులన్నీ భవిష్యత్తులో అక్షర సత్యాలుగా నిరూపితం కావడం తెలిసిందే. ప్రస్తుత కరోనా వ్యాధి గురించి కూడా తన కాలజ్ఞానంలో ముందే పేర్కొన్నారని విన్నాం. ఈశాన్యాన కోనంకి వ్యాధి పుడుతుందని, లక్షలాది మంది బలి అవుతారని చెప్పినట్లుగా కాలజ్ఞానంలో ఉంది.

కులమత రహిత సమాజం గొప్పదనాన్ని తన సూక్తులలో పేర్కొన్నారు. బ్రహ్మంగారి బాటలో నడుద్దాం. ఆయన సూక్తులు స్మరిద్దాం. బ్రహ్మంగారి బోధనలు అనుసరిద్దాం. కులమత రహిత సమాజం ఏర్పాటే లక్ష్యంగా పనిచేద్దాం.

సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేద్దాం. కులాల కుంపట్లకు దూరంగా ఉందాం. పరమత సహనం పాటించడం, శాంతియుత జీవనమే బ్రహ్మంగారికి మనం అర్పించే నిజమైన నివాళి’’గా చంద్రబాబు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ఇక అలా దర్శనాలు ఉండవు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి