సిగిరెట్ తేనందుకు... ఒళ్లంతా సిగిరెట్ గాట్లు పెట్టాడు. రాజ్యమా.. ఉలికిపడు..
కేవలం పది రూపాయలు తీసుకుని చెల్లించనందుకు ఎనిమిదేళ్ల బాలుడి ఒళ్లంతా సిగిరెట్ గాట్లు పెట్టి నరకయాతన పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలోని నెకునంబాద్ గ్రామానికి చెందిన వి. నరేంద్ర (19) వెంకటరావు అనే 8 ఏళ్ల అబ్బాయికి పదిరూపాయలిచ్చి స్థ
కేవలం పది రూపాయలు తీసుకుని చెల్లించనందుకు ఎనిమిదేళ్ల బాలుడి ఒళ్లంతా సిగిరెట్ గాట్లు పెట్టి నరకయాతన పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రకాశం జిల్లాలోని నెకునంబాద్ గ్రామానికి చెందిన వి. నరేంద్ర (19) వెంకటరావు అనే 8 ఏళ్ల అబ్బాయికి పదిరూపాయలిచ్చి స్థానిక అంగడి నుంచి సిగిరెట్లు తెమ్మని పంపాడు. మూడో తరగతి చదువుతున్న ఆ అబ్బాయి ఆ డబ్బును తన సొంతానికి వాడుకుని అవసరమైనవి కొనుక్కున్నాడు.
దీంతో ఆగ్రహం చెందిన నరేంద్ర ఆ పిల్లాడిని పట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లి, వెలిగించిన సిగిరెట్లతో కాల్చాడు. బుధవారం రాత్రంతా ఆ అబ్బాయిని తన వద్దే బందించిన ఆతగాడు వెంకట్రావు ఒళ్లంతా సిగిరెట్లతో కాల్చాడు. ఒళ్లంతా అణుమాత్రం ఖాళీ లేకుండా సిగిరెట్ల గాట్లు పెట్టి మరుసటి రోజు ఉదయం గ్రామానికి కాస్త దూరంలో అతడిని విడిచి పెట్టి వెళ్లిపోయాడు. అక్కడ ఏడుస్తున్న ఆ పిల్లాడిన ఒక మహిళ చూసి వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు చెప్పింది.
పది రూపాయలు ఇచ్చి పంపితే సిగిరెట్లు తీసుకురానందుకు ఆ అబ్బాయిని ఎంతగా చిత్ర హింసలు పెట్టాడంటే.. అతడి ముఖం నిండా, కంటిదగ్గర కూడా సిగిరెట్ మంటతో గాట్లు పెట్టాడు. విషయం తెలిసిన పోలీసులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ అబ్బాయిని చేర్పించి తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిత్రహింసలకు కొత్త అర్థం చెప్పిన ఆ క్రూరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.