ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని తమ ప్రభుత్వం పాలన, అధికార వికేంద్రీకరణకు కట్టుబడివుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు. అదేసమయంలో మూడు రాజధానుల బిల్లును ఎపుడో వెనక్కి తీసుకున్నామని, ఇకపై దానిపై హైకోర్టు తీర్పు ఏంటని ఆయన ప్రశ్నించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి, మూడు రాజధానుల అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపి గురువారం తుదితీర్పును ఇచ్చింది. ఈ తీర్పుపై ఏపీ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైకోర్టు తీర్పుపై ఇపుడే స్పందించడం సబబుగా ఉండదన్నారు. తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాత తన అభిప్రాయాన్ని వెల్లడిస్తామనని తెలిపారు.
అలాగే, రాజ్యాంగబద్ధమైన అధికారాలకు అనుగుణంగా చట్టాన్ని ఆమోదించే అధికారం అసెంబ్లీకి ఉందని ఆయన అన్నారు. చట్టాలను రూపొందించే అధికారం శాసనసభకు లేదంటూ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌పై మంత్రి స్పందిస్తూ.. చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు, శాసనసభలకు ఉన్నాయన్నారు.
అదేసమయంలో పరిపాలనను మూడు రాజధానులకు విస్తరించామని. పాలన వికేంద్రీకరణకు కృషి చేస్తున్నారని బొత్స నొక్కి చెప్పారు. అధికార వికేంద్రీకరణ కోసం మొత్తం పదమూడు జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానం పిలుపునిచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్నామని బొత్స అన్నారు.