ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు. ఆ రోజున ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆ రోజున సెలవు ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని షాపులు, స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఆయన జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ ఉద్యోగుల సంఘం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చి ఉద్యమ సంఘం నేతలతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చర్చలు గురువారం జరిగాయి. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, 94 ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఇప్పటివరకు 24 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు.