Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాలన కొడుకుది - పెత్తనం భార్యది - పేరుకే మంత్రి - బొజ్జల జీరో!

అటవీశాఖలో మీకేదైనా పని కావాలి.. లేకుంటే శ్రీకాళహస్తిలో ఏవైనా టెండర్లు కావాలా.. అయితే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలవనవసరం లేదండి. నేరుగా వెళ్ళి ఆయన కుమారుడు, భార్యను కలిస్తే చాలు.

పాలన కొడుకుది - పెత్తనం భార్యది - పేరుకే మంత్రి - బొజ్జల జీరో!
, గురువారం, 30 జూన్ 2016 (14:00 IST)
అటవీశాఖలో మీకేదైనా పని కావాలి.. లేకుంటే శ్రీకాళహస్తిలో ఏవైనా టెండర్లు కావాలా.. అయితే మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని కలవనవసరం లేదండి. నేరుగా వెళ్ళి ఆయన కుమారుడు, భార్యను కలిస్తే చాలు. అంతా నిమిషాల్లో జరిగిపోతాయి. అదీ లెక్క. నాకో లెక్కదంటూ వీరిద్దరు శ్రీకాళహస్తిలో రెచ్చిపోతున్నారు. పేరుకే అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అయినా పెత్తనం మొత్తం కొడుకు, భార్యలదే. వీరు చెప్పిందే వేదం.. అంతే.
 
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి.... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీశాఖామంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఈయనంటే చంద్రబాబుకు ఎంతో ఇష్టం. కారణం 2003 సంవత్సరం అక్టోబర్‌ 1వ తేదీన జరిగిన అలిపిరి బాంబు దాడి కేసులో తనతో పాటు బొజ్జల కూడా ప్రమాదానికి గురై గాయాలపాలయ్యారు. దీంతో చంద్రబాబుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. 
 
శేషాచలం అడవులు చిత్తూరుజి ల్లాలో ఉండటంతో ఈ ప్రాంతంలోని వన్యసంపదను కాపాడాలన్న ఉద్దేశంతో బాబు బొజ్జలకు అటవీశాఖామంత్రి పదవిని అప్పజెప్పారు. ఇంతవరుకు బాగానే ఉంది. అసలు కథంతా ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ప్రారంభమైంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌ రెడ్డి. ప్రస్తుతం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇక బొజ్జల భార్య బృందమ్మ. ఈమె పార్టీలో లేకపోయినా పెత్తనం మాత్రం అంతకు ఎక్కువగానే ఉంటుంది. ఎలాగంటారా.. అయితే చదవండి ఈ కథనం. 
 
అటవీశాఖకు సంబంధించిన ఎలాంటి పనులన్నా సుధీర్‌ రెడ్డిని కలిస్తే చాలు.. చాలా సులువుగా అయిపోతుంది. దానికొక లెక్క కూడా ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి... ఒక్కో పనికి ఒక్కోరేటన్న మాట... అలా ఉంటుంది... ఇక బృందమ్మ అంటారా... పేరు కోసం మాత్రమే ఈమె పనులు చేస్తారు. డబ్బులు తీసుకోవడమంటే అసలు ఈమెకు ఇష్టముండదు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వం కార్యాలయాలు, ఆలయం, ఏ పనైనా సరే నిమిషాల్లోనే చరవాణిల ద్వారా అయిపోతుంది. దటీస్‌ బృందమ్మ. తనకు తెలిసిన వారి తరపున వచ్చే ఎవరి పనైనా నిమిషాల్లో చేస్తారీమె. ఒక్క శ్రీకాళహస్తి మాత్రమే కాదు.. హైదరాబాద్‌‌లో కూడా ఏ పనైనా చేయగలదు ఈమె. అలా బృందమ్మ శ్రీకాళహస్తి ప్రజలకు అతి చేరువగా ఉంటున్నారు. 
 
సొమ్ము ఒకటిది.. సోకు ఒకటిది అన్న చందంగా బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంత్రి అయితే పెత్తనం మొత్తం వీరిద్దరిదే. మంత్రి ఏదో చేస్తారనుకోకండి.. ఆయన.. అసలు ఏం చేయరు... అసలు ఆయన జీరోనే అని.. బహిరంగంగానే ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అందుకే ఏపని కావాలన్నా వీరిద్దరి చుట్టూనే తిరుగుతున్నారు. కుటుంబ పాలనంటే ఇష్టంలేని సీఎం చంద్రబాబు మంత్రి బొజ్జల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ అక్రమాస్తుల డొంక కదిలిందిలా... హైదరాబాద్‌లోని ఆస్తుల మాటేంటి?