ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో బీజేపీకి సంఘీభావం తెలిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ... ఈ మధ్య పొత్తుకు దూరంగా ఉన్నట్లు కనిపించారు. కానీ, ఇపుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేనతో కలసి బీజేపీ ప్రచారం చేయడం రాజకీయ సమీకరణాలను మార్చేస్తోంది. జనసేన ఈ ఉప ఎన్నిక నుంచి దూరంగా ఉంటుందని అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ, ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బద్వేలులో శుక్రవారం జనసేనతో జతకట్టి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ..
ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఫైర్ అయ్యారు. బద్వేలులో ప్రజలకు త్రాగునీటి కష్టాలు విపరీతంగా ఉన్నాయని, నీటి కోసం కేంద్ర నుంచి నిధులు వచ్చాయి కానీ, రాష్ట్రంలో వైసిపి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్ళిస్తోందని విమర్శించారు. బద్వేలు బస్తీలా లేదు....గుంతల రోడ్లతో ప్రజలు కుస్తీ చేస్తున్నారని కామెంట్ చేశారు. టిడిపి శ్రేణులను కలిసి, వారికి ఉన్నతమైన పదవులు ఇస్తాం అని... బద్వేలు ఉప ఎన్నికల్లో సహకరించాలని వైసీపీ మంత్రులు కోరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
టీడీపీ శ్రేణులను కలిసినట్లు సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. బిజెపికి ఏజెంట్లు కూడా ఉండరని వైసీపీ నేతలు అంటున్నారు కానీ, స్వచ్చందంగా బీజేపీ తరపున ఏజెంట్లుగా కూర్చోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఓటర్లను వలంటీర్ల ద్వారా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, బద్వేలు అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థిని అఖండ మెజారిటీ తో గెలిపించాలని సోము వీర్రాజు కోరారు. మంత్రి పెద్దిరెడ్డి బద్వేలు అభివృద్ధిపై చర్చకు రావాలని సవాలు చేశారు.