ఏపీలోని అధికార వైకాపా పార్టీ హయాంలో ఎటు చూసిన భూ కబ్జాలే జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్ ఆరోపించారు. ఏపీకి వైకాపా రూపంలో చెద పట్టిందని విమర్శించారు. రాష్ట్రం పూర్తిగా సోమాలియా, సూడాన్, పాకిస్థాన్, శ్రీలంక మాదిరి తయారవుతోందని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
'రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వైకాపా సర్కార్ నెరవేర్చట్లేదు. రాష్ట్రంలోని అన్నదాతలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారు. నరేగా నుంచి వస్తున్న నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. పేదల కోసం కేంద్రం ఇస్తున్న లక్షల ఇళ్లు పూర్తి చేయడం లేదని ఆరోపించారు.
'మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిస్తున్నారు. పక్క రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారు. నిరసన తెలిపే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు' అని సత్యకుమార్ మండిపడ్డారు.