ఉచితంగా లేదా డిస్కౌంట్ ధరలకు ఏదేనీ వస్తువు విక్రయిస్తున్నారంటే జనాలు ఎగబడతారు. అయితే, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీలోని నంద్యాలలో ఓ వ్యాపారి ఐదు పైసలకే బిర్యానీ అందించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బిర్యానీ కోసం ఎగబడ్డారు. పాతకాలం నాటి ఒక పైసా లేదా ఐదు పైసలు నాణెం ఇస్తేనే బిర్యానీ ఫ్రీ అని ప్రకటించి షరతు పెట్టాడు. అయినప్పటికీ పాత నాణేలతో వందలాది మంది ప్రజలు బిర్యానీ కోసం తరలివచ్చారు.
యువకులు, మహిళలు, చిన్నారులు భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. చివరకు పోలీసుల ఆదేశంతో నిర్వాహకులు రెస్టారెంట్‌ను మూసివేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ తరహా ప్రకటన చేసినందుకు రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెడతామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.