Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర మంత్రివర్గంలోకి నరసాపురం ఎంపి భూపతి వర్మ (video)

bhupathiraju srinivsa varma

వరుణ్

, ఆదివారం, 9 జూన్ 2024 (14:05 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి మరోమారు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 30 మంది మంత్రులతో మోడీ సర్కారు కొలువుదీరనుంది. ఈ మంత్రివర్గంలో ఏపీ నుంచి టీడీపీ తరపున ఇద్దరికి కేంద్ర మంత్రులుగా నియమితులుకానున్నారు. ఇపుడు మరో మంత్రి పదవిని కూడా రాష్ట్రానికి కట్టబెట్టనున్నారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. 
 
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ ఘన విజయం సాధించారు. పైగా, ఆది నుంచి బీజేపీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై అపారమైన నమ్మకంతో ఉన్నారు. గతంలో ఓడిపోయినప్పటికీ పార్టీ మారకుండా పార్టీ కోసం పని చేశారు. దీనికి గుర్తింపుగా ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. 
 
శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్నారు. 1988లో ఆ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది. కాగా, ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ఎండీసీ కార్యాలయం సీజన్... ఎండీపై వేటు : ఏపీ సర్కారు వేటు