బ్యాంకు ఎదుట ఖాతాదారుల ఆందోళన.. బ్యాంకు మూసేసి భయంతో మేనేజర్ పరుగో పరుగు
పెద్దనోట్ల రద్దు తర్వాత చిల్లర సమస్యతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. గంటల తరబడి క్యూలో నిలబడినా చివరకు డబ్బు లేకపోవడంతో ప్రజలు సహనం కోల్పోతున్నారు. నిగ్రహం కోల్పోయిన పలువురు ఆగ్రహావేశాలకు
పెద్దనోట్ల రద్దు తర్వాత చిల్లర సమస్యతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. గంటల తరబడి క్యూలో నిలబడినా చివరకు డబ్బు లేకపోవడంతో ప్రజలు సహనం కోల్పోతున్నారు. నిగ్రహం కోల్పోయిన పలువురు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ బోరండలోని సిండికేట్ బ్యాంకు వద్ద జరిగింది. గత నాలుగు రోజులుగా డబ్బు ఇవ్వడం లేదంటూ ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగిన ఖాతాదారులు నినాదాలు చేశారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన సిండికేట్ బ్యాంక్ మేనేజరు బ్యాంకును మూసివేసి అక్కడి నుంచి జారుకున్నాడు.
మరోవైపు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధన కుబేరులకు రేయింబవుళ్లు నిద్ర పట్టడం లేదు. రద్దయిన నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదివారం జైపూర్, రాజ్‌కోట్, జార్ఖండ్‌ల్లో రూ.3.4 కోట్ల విలువైన పెద్ద నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్‌లోని అల్వాల్ జిల్లాలో రూ.1.32 కోట్ల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 నోట్లతో పాటు కొత్త రూ.2 వేల నోట్లను ఢిల్లీ నుంచి తరలిస్తుండగా కిషన్‌గఢ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరికొన్ని చోట్ల అక్రమ సంపాదనాపరులు... తమ వద్ద ఉన్న చెల్లని నోట్లను రోడ్లపై పడేస్తున్నారు. వీటిని తీసుకునేందుకు పేదలు పరుగులు పెడుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఒక జిన్నింగ్ ఫ్యాక్టరీలో రద్దు చేసిన పెద్ద నోట్లను ఆదివారం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఒక్కొకరికి రూ.10 వేల చొప్పున అందించనున్నారని పుకార్లు వ్యాపించాయి.
దీంతో పట్టణంలోని పలు కాలనీలకు చెందిన 150 మంది వరకు పేదలు ఉదయం 6 గంటలకే ఫ్యాక్టరీకి చేరుకొని పడిగాపులు కాశారు. మూడు గంటలపాటు అక్కడే ఉన్నారు. 9 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీ సిబ్బంది బయటకు వెళ్లే సమయంలో పెద్ద నోట్ల పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు. దీంతో ఖంగుతిన్న ఫ్యాక్టరీ సిబ్బంది ఇక్కడ ఎలాంటి నోట్ల పంపిణీ లేదని, ఎవరో తప్పుడు ప్రచారం చేశారని వివరించారు.