Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై 1 నుంచి బాలామృతం పంపిణీ చేస్తాం... మంత్రి పరిటాల సునీత

అమరావతి : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో బాలామృతం పంపిణీతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ అన్న అమృతహస్తం పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలాగే

Advertiesment
Balamrutham
, శుక్రవారం, 16 జూన్ 2017 (18:20 IST)
అమరావతి : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో బాలామృతం పంపిణీతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ అన్న అమృతహస్తం పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలాగే, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఒకటో తేదీ నుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నామని ఆమె తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని మూడో బ్లాక్‌లో 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు బాలామృతం పథకాన్ని అమలు చేశారన్నారు. తెలంగాణాలో బాలామృతం తయారుచేసిన యూనిట్ ఉండడంతో, రాష్ట్ర విభజన తరవాత ఏపీలో పంపిణీ నిలిచిపోయిందన్నారు. కొద్ది నెలలుగా తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో, మరోసారి ఏపీలో బాలామృతం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాలామృతం ప్యాకెట్లను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది చిన్నారుల లబ్ధి చేకూరుతుందని మంత్రి సునీత తెలిపారు.
 
జూలై 1 నుంచి అన్న అమృతహస్తం...
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టుల్లోనే అన్నమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ర్టంలో అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోనూ ఈ పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద గర్భిణులకు, బాలింతలకు అన్నఅమృతహస్తం పథకం కింద ఆహారం అందిస్తామన్నారు. రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజుల పాటు మంచి భోజనం అందిస్తామన్నారు. మహిళల్లో రక్తహీనత నివారణతో పాటు పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
 
ఇకపై అంగన్వాడీ కార్యకర్తల ఖాతాల్లో వేతనాలు జమ...
జులై ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో వారి వేతనాలు జమ చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఇకపై జీతాల కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పుతాయన్నారు. దీనివల్ల కార్యకర్తలకు సమయం ఆదా కూడా అవుతుందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్యలు పూర్తి చేశామన్నారు. మున్సిపాల్టీలోని నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లగా మార్చి, ఇంగ్లీష్ మీడియంలో బోధన సాగిస్తామన్నారు. ఇందుకు కార్యకర్తలకు అవసరమైన శిక్షణ కూడా అందజేశామన్నారు. 
 
ఆగస్టులోగా అంగన్వాడీ భవనాల నిర్మాణాల పూర్తి...
రాష్ట్రంలో 7 వేల అంగన్వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ భవనాలన్నింటినీ వచ్చే ఆగస్టులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 1,422 భవనాల నిర్మాణం పూర్తయ్యాయన్నారు. మిగిలిన భవనాలు ఆగస్టులోగా పూర్తవుతాయన్నారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా జరుగుతున్న కోడిగుడ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
webdunia
 
కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం చూపొద్దు...
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అంతకుముందు 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. శిశువులు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోందన్నారు. ఐసీడీఎస్ అధికారులు కూడా బాధ్యాయుతంగా విధులు నిర్వర్తిస్తూ, ప్రజారోగ్యానికి కృషి చేయాలన్నారు కేంద్రాల నిర్వహణలో అంగన్వాడీ కార్యకర్తలు అలసత్వం వీడకపోతే, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సునీత హెచ్చరించారు. ఏ స్థాయి అధికారయినా ఉపక్షేంచేది లేదన్నారు. 
 
శాఖలో ఏ చిన్న సమస్య వచ్చినా, కుటుంబంలో మాదిరిగా కూర్చుని చర్చించుకుని పరిష్కరించకుందామన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్లు వారంలో రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను గుర్తించి, తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తామన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంచి పేరు తీసుకొద్దామన్నారు. అంగన్వాడీ కేంద్రాల అనంతరం ప్రీ స్కూళ్లలో విద్యార్థులకు అందించే కిట్లను మంత్రి పరిటాల సునీత ఆవిష్కరించారు. రూ.3 వేల విలువ చేసే కిట్‌ను ఒక్కో ప్రీ స్కూల్‌కు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అపర్ణ ఉపాధ్యాయ, కమిషనర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు నెలలకో అమ్మాయి... శిరీషకు పనిభారం పెంచి వంచించిన రాజీవ్(వీడియో)