Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేర తీవ్రత, బలమైన కారణాలు ఉంటేనే బెయిల్ ర‌ద్దు

నేర తీవ్రత, బలమైన కారణాలు ఉంటేనే బెయిల్ ర‌ద్దు
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:54 IST)
బలమైన, అనివార్యమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిందితునికి బెయిల్‌ రద్దు చేయాల్సి ఉంటుందని సోమవారం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వరకట్నం మరణం కేసులో ఓ నిందితురాలికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసే సమయంలో అనుసరించాల్సిన విధానాలను స్పష్టం చేసింది.
 
 ‘‘నేర తీవ్రత, నిందితుని ప్రవర్తన, విచారణ జరుగుతున్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడం కారణంగా సమాజంపై పడే ప్రభావం వంటి అంశాలను పరిశీలించాలి. న్యాయ ప్రక్రియకు భగ్నం కలుగుతుందని భావించినప్పుడు, దర్యాప్తునకు బలం కల్పించాలని అనుకున్నప్పుడు బెయిల్‌ను రద్దు చేయవచ్చు. ముందస్తు బెయిల్‌ ఇవ్వడమన్నది సహజంగానే అసాధారణ నిర్ణయం. నిందితుడు సాక్షులను ప్రభావితం చేయడం, బాధితుల కుటుంబ సభ్యులను బెదిరించడం, పరారవడం, దర్యాప్తునకు ఆటంకాలు కలిగించడం వంటివి చోటుచేసుకుంటాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెలువరించాల్సి ఉంటుంది. 
 
బెయిల్‌ ఇచ్చే సమయంలో కన్నా, బెయిల్‌ రద్దు చేసే సమయంలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి. బెయిల్‌ ఇచ్చిన తరువాత జరిగిన పరిణామాలను పరిశీలించాలి. అవి స్వేచ్ఛాయుత విచారణకు అనువుగా ఉన్నాయో లేవో చూడాలి. బెయిల్‌ మంజూరు సమయంలో ముఖ్యమైన విషయాలను విస్మరించారని భావించినప్పుడు, అనవసరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని అనుకున్నప్పుడు కూడా దాన్ని రద్దు చేయవచ్చు. ప్రతి కేసుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి’’ అని వివరించింది. 
 
దర్యాప్తునకు సహకరిస్తున్నారన్న కారణంతో నిందితురాలికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని, కానీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. కోడల్ని క్రూరంగా హింసించారన్న ఆరోపణలు ఉండడంతో పాటు, రెండేళ్లపాటు పరారీలో కూడా ఉన్నారని అందువల్ల బెయిల్‌ ఇవ్వడం తగదని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో స్వేచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్