Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దారినపోయే దానయ్యకు సూటూ బూటూ తొడిగితే పెట్టుబడులొస్తాయా బాబూ: జగన్

రాష్ట్రస్థాయిలో జరిగే భాగస్వామ్య సదస్సులలో అవగాహనా ఒప్పందాలు కుదిరినంత మాత్రాన రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చేస్తుందనటానికి ఒక్క ఆధారం చూపు చంద్రబాబూ అంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఏపీ సీఎంని కడిగిపారేశారు. గురువారం యువభేరి కార్యక్రమంలో ప్రత్యేక హోదా

దారినపోయే దానయ్యకు సూటూ బూటూ తొడిగితే పెట్టుబడులొస్తాయా బాబూ: జగన్
హైదరాాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (03:54 IST)
రాష్ట్రస్థాయిలో జరిగే భాగస్వామ్య సదస్సులలో అవగాహనా ఒప్పందాలు కుదిరినంత మాత్రాన రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చేస్తుందనటానికి ఒక్క ఆధారం చూపు చంద్రబాబూ అంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఏపీ సీఎంని కడిగిపారేశారు. గురువారం యువభేరి కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోసం నిరసనలో పాల్గొన్న జగన్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగటం మాటేమిటో కానీ అబద్ధాలస్థాయిని మాత్రం ఏటేటా పెంచుకుంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు పెట్టుబడుల ప్రచారంపై ప్రతిపక్ష నేత విమర్శలు ఆయన మాటల్లోనే చూద్దాం. 
 
విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాల స్థాయిని ఏటా పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా కేంద్రానికి సీఎం సంకేతాలు ఇస్తున్నారు. 2016 జనవరిలో జరిగిన సదస్సులో రూ.4.67 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో రూ.2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. కానీ వాస్తవమేమిటి?
 
రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదిరిన తర్వాత.. ఆయా పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ‘ఇండస్ట్రియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ మెమొరాండం’ (ఐఈఎం) సమర్పించాల్సి ఉంటుంది. పారిశ్రామిక ఒప్పందాలు తదుపరి దశకు చేరడానికి ఇది తప్పనిసరి. అయితే ఐఈఎం దాఖలు చేసినంత మాత్రాన కూడా పరిశ్రమలు పెడతారని చెప్పలేం. 2016లో రూ.34,464 కోట్ల మేర ‘ఐఈఎం’ దాఖలు చేశారు. అందులో రూ.7 వేల కోట్ల మేర మాత్రమే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. 
 
2017 జనవరి భాగస్వామ్య సదస్సులో రూ.10.54 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయని అబద్దాల స్థాయిని మరింత పెంచారు. పెట్టుబడులు వస్తే అందరికీ సంతోషమే. కానీ.. ఎవరికి పడితే వారికి సూటు, బూటు వేసి రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలని సంతకాలు చేయించి ప్రజలను మోసం చేస్తేనే అందరికీ ప్రమాదం. ఎంవోయూల పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి సంబంధించి ప్రస్తుతం రెండు ఉదాహరణలు చెబుతాను. 
 
త్రిలోక్‌ కుమార్‌ అనే ఆయన ఎంవోయూ కుదుర్చుకున్నారని చూపించారు. ఆయన అనకాపల్లికి చెందిన గంధం నందగోపాల్‌ అనే పారిశ్రామికవేత్త తరపున ప్రెస్‌నోట్లు తెచ్చి విలేకరులకు ఇస్తుంటారు. అంటే పీఆర్వో అన్నమాట. ఆయనకు సొంత వాహనం కూడా లేదు. మరి ఆయన కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఎంవోయూ కుదుర్చుకున్నాడో చంద్రబాబుకే తెలియాలి. మరొకరు దొడ్డల సుధీర్‌. గుంటూరు జిల్లా సంతగుడిపాడుకు చెందిన ఈయన రియల్‌ ఎస్టేట్‌ ఏజంట్‌గా పనిచేస్తారు.  ఆయన భార్య అంగన్‌వాడీ టీచర్‌. ఈయన కూడా కోట్ల పెట్టుబడులు ఎలా పెడతాడో చంద్రబాబే చెప్పాలి. 
 
ఇలా కనిపించిన వారికి సూటు, బూటు వేసి ఎంవోయూలపై సంతకాలు చేయించేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆలోక్యరాజ్‌ చంద్రబాబు దెబ్బకు భయపడి ఆ ఫైళ్లపై సంతకాలు పెట్టను అని అన్నారు. ఎంవోయూల పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలకు ఇదీ నిదర్శనం. అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కడిగిపారేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత పళనిస్వామి