Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత పళనిస్వామి

బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి సీఎంగా అవతరించారు. ఆయనే తమిళనాడుకు 13వ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎడపాడి కే పళనిస్వామి. ఒకప్పుడు అన్నాడీఎంకేలో సీనియర్‌ నేతగా చక్రం తిప్పిన సెంగోట్టయన్‌కు మద్దత

బెల్లం మండీ నుంచి సీఎంగా ఎదిగిన నేత పళనిస్వామి
హైదరాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (03:33 IST)
బెల్లం మండీతో నాడు బతుకు జీవన పయనంలో అడుగుపెట్టిన ఓ రైతు, నేడు ఓ రాష్ట్రానికి  సీఎంగా అవతరించారు. ఆయనే తమిళనాడుకు 13వ సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎడపాడి కే పళనిస్వామి. ఒకప్పుడు అన్నాడీఎంకేలో సీనియర్‌ నేతగా చక్రం తిప్పిన సెంగోట్టయన్‌కు మద్దతుదారుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పళనిస్వామి, ప్రస్తుతం ఆయన్నే మించిపోయారు. నేడు పళనిస్వామి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా సెంగోట్టయన్‌ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఎడపాడి నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళనిస్వామి కాస్తా ఎడపాడి కే పళనిస్వామి అయ్యారు. సేలం జిల్లా ఎడపాడి నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్‌ దంపతుల చిన్న కుమారుడు పళని స్వామి(63).
 
ఈరోడ్‌లోని శ్రీ వాసవీ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తండ్రి అడుగు జాడల్లో వ్యవసాయంతో పాటు బెల్లం మండీతో జీవన పయనాన్ని సాగించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. భార్య రాధ, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండీని నడుపుతూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనులు చేసుకుంటూనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి మంత్రి ఈరోడ్‌ ముత్తుస్వామి భూములు తన భూముల పక్కనే ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. అన్నాడీఎంకేలో చేరగానే, శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవి చూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ మరణంతో ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు పళనిస్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి.
 
ఈరోడ్, సేలం, నామక్కల్‌ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలకనేతగా ఉన్న సెంగోట్టయన్‌ మద్దతుదారుడిగా జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్‌ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆయన మద్దతుతో పళనిస్వామి సేలం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడంతో ఆ స్థానం పళనిస్వామికి దక్కింది. అప్పటినుంచి చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళనిస్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం విశేషం. అప్పట్లో పళనిస్వామి రాజకీయంగా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన సెంగోట్టయన్‌ ప్రస్తుతం ఆయన కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఇదే కేబినెట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న తంగమణి, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న కరుప్పనన్‌ సీఎంకు దగ్గరి బంధువులు.
 
పళని స్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కే పళనిస్వామి ఆస్తి రూ. 9.69 కోట్లు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఈ మేరకు తన ఆస్తిని ప్రకటించారు. ఎలాంటి అప్పులు లేవని, తన కుటుంబీకులు ఎవరి పేరిట ఎలాంటి వాహనం కూడా లేదని అందులో పేర్కొని ఉండడం గమనార్హం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాటాదారుల షేర్లు కంపెనీలు కొనేస్తే లాభం ఎవరికి, నష్టం ఎవరికి?