తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగిపోతుందనే అక్కసుతోనే వైసీపీ దాడులు చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విమర్శించారు. జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధమేనన్నారు. తానేమి బూతులు మాట్లాడలేదని చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గుంటూరు జిల్లాకు వెళితే ప్రజలు బ్రహ్మాండమైన స్వాగతం పలికారని, ఇలా ఉంటుందని ఊహించలేదన్నారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. దీంతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడనని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారని, అది బలవంతంగా ఇచ్చారనేది ఆ స్టేట్ మెంట్ చూస్తే అర్థమవుతుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. రెండు నెలల్లో ఆయన మంత్రి పదవి పోయేలా ఉందని, మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు.
రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని సూచించారు. పార్టీ కోసం, ప్రభుత్వం చేస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలపై తాము మాట్లాడతామని, అధికారపార్టీ ఏం చేసినా భయపడేది లేదని అయ్యన్న స్పష్టం చేశారు.