Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దేవినేని అవినాష్‌

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దేవినేని అవినాష్‌
, గురువారం, 14 నవంబరు 2019 (20:02 IST)
తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగు యువత అధ్యక్ష పదవికి, పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

"మా నాన్న గారు నాకు చిన్నప్పటి నుండి ఒక మాట చెప్పేవారు ..'మన వ్యక్తిగత జీవితాల కన్నా , మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు ముఖ్యం .. వారి శ్రేయస్సు కోసం మనం  ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు' అని చెప్పారు.

నేను ఎవరిని కించపరిచేలా కానీ, అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం నా స్వభావం. ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే అది ప్రజలు కార్యకర్తలు అండతోనే సాధ్యం. 

అదే నాయకుడు ఒక అడుగు వేశాడంటే అండగా ఉన్న కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసమే. నాకు మీరు ఇచ్చిన బలం మీకే చెందుతుంది తప్ప ఎన్నడూ నా లాభాపేక్ష ఉండదు. నాకు తెలిసింది నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కమిట్మెంట్ తో  పనిచేయడమే. ఒక అడుగు వేసేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయి. అదే విధంగా ఒక మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించి అనాలి.  
 
తెలుగుదేశంపార్టీ .. కృష్ణా  జిల్లాలో  ఉన్న మా నాయకులను , కార్యకర్తలను వినియోగించడంలో విఫలం అయింది. పార్టీలో చేరినప్పటి నుండి అధినాయకుడి మాటే .. నా బాట అని నిబద్ధతతో పని చేసాను. అదే విధంగా మా కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం కల్పించమని చంద్రబాబు గారిని కోరాను. 

నామీద నమ్మకంతో మీరు నాకు అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహించాను. ఎన్నికలలో నాకు అనువైన  స్థానం కాకపోయినా మీ ఆదేశాల మేరకు గుడివాడ నుండి పోటీచేశాను. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసాను.

కానీ ఇన్నాళ్లు నా కష్టంలో నష్టంలో అనుక్షణం నావెన్నంటి ఉన్న కార్యకర్తలకు, దేవినేని నెహ్రూగారి అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించింది. కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదు. 

కానీ నా నిబద్ధతను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుని, మా కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడంలో పూర్తిగా విఫలం అయింది. ఈ రోజు నేను కానీ, మా నాన్న గారు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల వల్ల మాత్రమే. 
 
అలాంటిది మా కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట నేను ఉంటూ ఆత్మవంచన చేసుకోలేను. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం, పైగా భజన చేసే వారికి వత్తాసు పలకడం .. నా మనసును ఎంతో గాయపరిచాయి.

పార్టీ మారే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్తున్నా ఎప్పటికప్పుడు నేను పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి  నాగురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చెయ్యడంలో సఫలం అయినవాళ్ళని ఇంకా చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయింది. 

పార్టీ నాకు అందించిన ప్రతి పనినీ బాధ్యతగా నిర్వర్తించాను, కానీ నేడు అసలు నా విషయంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు నన్నే కాదు నా కార్యకర్తలు అనుచరులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న గుడివాడ ఇంచార్జి అన్నారు, ఈరోజు గన్నవరం అంటున్నారు. రేపు ఇంకెక్కడో?

ఇలా ప్రతిసారీ నేను మారినా నా కార్యకర్తలు కూడా మారాలంటే ఎలా? స్థానికంగా బలపడుతున్న ప్రతీసారీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తుంటే ఎక్కడ కుదురుకోవాలి? ఎలా పార్టీని బలపరచాలి? అందుకే ..కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట .. పార్టీ వీడాలని నిర్ణయించుకున్నాను.

నన్ను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబు గారికి నా కృతఙ్ఞతలు. మీ మీద నాకున్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుంది" అని లేఖలో పేర్కొన్నారు. అతడితో పాటు సీనియర్ నేత కడియాల బచ్చిబాబు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదన్న అసంతృప్తితోనే అవినాష్ టిడిపికి రాజీనామా చేసినట్లు సమాచారం.
 
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దేవినేని అవినాష్‌
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జగన్‌ నాయకత్వంలో పనిచేయాలన్న ఆలోచనతోనే తాను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు దేవినేని అవినాష్‌ అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఆకాంక్షతో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రారంభించారో ఆ పథకాలే పార్టీలో చేరేలా తనను ప్రోత్సహించాయని ఆయన స్పష్టం చేశారు. 

ఆయన కష్టంలో సైనికుల్లా పనిచేయాలన్న ఆలోచనతోనే ఇవాళ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనతో పాటు కడియాల బుచ్చిబాబు, నలభై యేళ్లుగా దేవినేని నెహ్రూతో కలిసి ప్రయాణించిన వారందరూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామన్నారు.

దేవినేని నెహ్రూతో ఉన్న అనుబంధంతో ఇవాళ మాకు సహకరించిన పెద్దలు సుబ్బారెడ్డిగారు, సాయిరెడ్డిగారు నన్ను వాళ్ల కుమారుడిగా భావించి అక్కున జేర్చుకున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తామందరం  కష్టపడతామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏంటి చంద్రబాబు గారూ, సీఎం జగన్‌కు ఆ టైమివ్వరా?, అందుకే వెళ్తున్నా: వల్లభనేని