ఈసారి పంద్రాగస్టు వేడుక అంతా కరోనా అలెర్ట్ తో కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తున్నారు.
విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు, వేడుకల రిహార్సల్స్ ను అయన దగ్గరుండి చూశారు.
పోలీస్ పరేడ్, ముఖ్యమంత్రి ప్రసంగం, మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన బద్రత చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తోంది.
డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందన్నారు. వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం అని డిజిపి చెప్పారు.