ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతను వైకాపా మూకలు గొడ్డళ్ళతో నరికివేశారు. జిల్లాలోని రొంపిచెర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్ళతో దాడి చేశారు.
ఆయన మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న సమయంలో మాటేసిన కొందరు దండగులు బాలకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స కోసం నర్సారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మరోవైపు, బాలకోటిరెడ్డిపై దాడిని తెదేపా నేతలు ఖండించారు. సీఎం జగన్ రెడ్డి ప్యాక్షన్ భావాల్ని నరనరనా నింపుకున్న వైకాపా కార్యకర్తలు మృగాల కంటే హీనంగా ప్రవరిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రతి రోజూ సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార మదంతో తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తున్న వైకాపా నేతలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు.