పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. బుధవారం ఉదయం కానూరులోని మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ హెడ్ అమిత్ కుమార్ సింగ్ తమ కంపెనీకి సంబంధించిన పలు కీలక విషయాలపై మంత్రితో చర్చించారు.
ఏషియన్ పెయింట్స్ 2019, జనవరి, 4న ఉత్పత్తిని ప్రారంభించినట్లు మంత్రి మేకపాటికి అమిత్ కుమార్ సింగ్ వివరించారు. ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఏపీలో విస్తరించాలనుకుంటున్న నేపథ్యంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, శిక్షణ వంటి విషయాలపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. మొదటి దశలో రూ.1350 కోట్ల పెట్టుబడి పెట్టి, 700 మందికి ఉపాధి అందించాలనుకున్న లక్ష్యాన్ని అధిగమించి 750 మందికి ఉద్యోగాలిచ్చామని మంత్రికి తెలిపారు. అందుకు మంత్రి మేకపాటి ఏషియన్ పెయింట్స్ సంస్థ నిబద్ధతని అభినందించారు.
ఫ్యాక్టరీకి ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికెట్ సహా వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని సంస్థకు స్వయంగా వినియోగించుకునే హార్వెస్టింగ్ స్ట్రక్చర్, రిన్యువబుల్ విద్యుత్ ఏర్పాటు ద్వారా 5.2 మెగా వాట్ల (సోలార్, విండ్) విద్యుత్ ఉత్పత్తి చేసుకుని 75శాతం అవసరాలకు వినియోగించుకున్నట్లు వివరించారు. ఏషియన్ పెయింట్స్ ఏడాదికి విడుదల చేసే సీఎస్ఆర్ నిధులను రూ.3 కోట్లు సామాజిక బాధ్యత కింద విశాఖ అభివద్ధి కోసం వినియోగించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో అదనంగా కోవిడ్ విపత్తు నిర్వహణ కోసం మరో రూ.3 కోట్లు అదనంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన విషయాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి వద్ద ప్రస్తావించారు.
ప్రతి ఏడాది తమ మొబైల్ కలర్ అకాడమీ ద్వారా 15000 నుంచి 17000 మందికి శిక్షణ అందించి పెయింటర్లుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రికి అమిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ప్రతి ఏడాది వైజాగ్ లో 75 మంది ఐ.టీ.ఐ అభ్యర్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. త్వరలోనే రెండో దశ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నామని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం 3 కె.ఎల్ సామర్థ్యంతో ఉన్న ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ రెండో దశ పూర్తి నాటికి కె.ఎల్ సామర్థ్యంతో పెయింట్స్ రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించనుందని మంత్రి మేకపాటికి వివరించారు.