మోసగాళ్ళ వలలో పడి నష్టపోకుండా ఆరోగ్యశ్రీ లబ్దిదారులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇవో డాక్టర్ ఎ.మల్లికార్జున మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మధ్య కొందరు మోసగాళ్ళు ఫోన్ చేసి "మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, ప్రభుత్వం నుంచి మీ అకౌంట్‌కి కొంత డబ్బు పంపుతాం, మీ అకౌంట్‌లో ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది, మీ డెబిట్ కార్డు లేక క్రెడిట్ కార్డు నెంబర్ చెప్పండి, సివివి నెంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి అని కొందరు మోసగాళ్ళు ఫోన్ ద్వారా అడుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది " అని ఆయన పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ఒక వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోందనీ, దీనికీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కి ఎటువంటి సంబంధమూ లేదనీ ఆయన వివరించారు.
"ఆరోగ్యశ్రీ ఆఫీసు వాళ్లు మీ బ్యాంకు వివరాలు, ఓటీపీ నెంబర్, సి.వి.వి నెంబర్ ఎప్పుడూ అడగరు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటువంటి మోసగాళ్ళ వలలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి" అని మల్లికార్జున తెలిపారు.