Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కొంటున్న‌ ఏపీఎస్‌ఆర్టీసీ...నెల్లూరు, కడప, మదనపల్లి

100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కొంటున్న‌ ఏపీఎస్‌ఆర్టీసీ...నెల్లూరు, కడప, మదనపల్లి
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 9 నవంబరు 2021 (14:36 IST)
దేశంలో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ బస్సులను తయారుచేసిన, ఎలక్ట్రిక్ మొబిలిటీ అగ్రగామి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్ (ఒలెక్ట్రా), ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కన్సార్షియం ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల ఆర్డర్‌ను పొందింది. ఆ ఆర్డర్‌ ప్రకారం 100 ఎలక్ట్రిక్‌ బస్సులను గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) అపెక్స్ మోడల్ ప్రాతిపదికన అందించాల్సి ఉంటుంది. 
 
 
ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమలులో ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ. 140 కోట్లు. వచ్చే 12 నెలల కాలంలో ఈ బస్సులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.  ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. ఇందులో 50 బస్సులను తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులోనూ, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడపనున్నారు. కాంట్రాక్టు కాలంలో బస్సులను మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ చేయనుంది. ఈ కొత్త ఆర్డర్‌తో ఒలెక్ట్రా ఆర్డర్‌ బుక్‌ దాదాపుగా 1450 బస్సులకు చేరుకుంది. 
 
 
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ కే.వి ప్రదీప్‌ మాట్లాడుతూ, శ్రీ వేంకశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతి ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే భక్తులకు సేవలందించే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులను ఆపరేట్‌ చేసే అవకాశం కలిగినందుకు గర్వంగా ఉంద‌ని, శేషాచల అడవులు, తిరుమల ఘాట్‌ రోడ్డుల సంపన్న పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో మా బస్సులు తోడ్పడతాయ‌న్నారు. ఎఫీషియెంట్‌ ఎలక్ట్రిక్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంద‌న్నారు.
 
 
మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే మా ఈ వంద బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా విజయవంతం అవుతాయన్న నమ్మకం ఉంద‌ని, మా ఎలక్ట్రిక్‌ బస్సులు మన్నికను, పనితీరును ఇప్పటికే నిరూపించుకున్నాయ‌ని చెప్పారు. ముంబయ్, పూ‎ణే, నాగ్‌పూర్‌, హైదరాబాద్‌, సూరత్‌, డెహ్రాడూన్‌, సిల్వాస, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళలో విజయవంతంగా త‌మ‌ బస్సులు నడుస్తున్నాయ‌ని చెప్పారు.
 
 
ఇండియాలో  ఎలక్ట్రిక్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌లో అగ్రగామి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తయారు చేసిన  కాలుష్య రహిత, శబ్ద రహిత ఎలక్ట్రిక్‌ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌ పౌరులు తొలిసారిగా ఇక నుంచి ప్రయాణించవచ్చు. ఈ  9 మీటర్ల ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సుల్లో సీట్ల సామర్థ్యం 35 ప్లస్‌ డ్రైవర్‌. ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్‌ చేసే ఎయిర్‌ సస్పెన్షన్‌తో సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఈ బస్సుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇస్తాయి. ఎమర్జెన్సీ బటన్‌, ప్రతి సీటుకు యుఎస్‌బీ సాకెట్‌ ఉంటుంది. 
 
 
లీథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్న ఈ బస్సులు ఒక్కసారి ఛార్జి చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్‌ లోడ్‌లను బట్టి 180 కిలోమీటర్ల వరకు  ప్రయాణిస్తాయి. సాంకేతకంగా అత్యాధునికమైన ఈ బస్సులో ఉన్న రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వల్ల బ్రేక్ వేయడం వల్ల నష్టపోయే శక్తిలో కొంత భాగాన్ని తిరిగి పొందే వీలు ఉంది. హైపవర్‌ ఏసీ, డీసీ ఛార్జింగ్‌ సిస్టమ్‌ వల్ల బ్యాటరీ కేవలం మూడు గంటల్లోనే ఛార్జీ అవుతుంది. 
 
 
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సులు దేశంలో ఇప్పటికే నాలుగు కోట్ల కిలో మీటర్లు తిరిగి దాదాపు 35,700 టన్నుల  కార్బన్‌ కాలుష్యాలను తగ్గించగలిగాయి. ఇది రెండు కోట్ల చెట్లు నివారించగలిగిన కాలుష్యానికి సమానం. ఒలెక్ట్రా ఇప్పటికే దాదాపు 400 బస్సులను వివిధ రాష్ట్రాలకు సప్లై చేసింది. మనాలి, రోహతంగ్‌ పాస్‌ మధ్య ఎత్తైన పర్వత శ్రేణుల్లోనూ నడిచి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ఎక్కున ఘనత ఒలెక్ట్రా బస్సులది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోదీజీ! ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తాన‌న్నారు... ఏమైంది?