ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని అధికారులు వెల్లడించారు.
వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు ఆకస్మికంగా సంభవించే అవకాశం ఉందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అలెర్ట్‌గా ఉంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.
ఇప్పటికే ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షపాతం నమోదైందని సంస్థ తెలిపింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరులో 34.2 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీపురంలో 31 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 26.7 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయినట్టు తెలిపింది.