ఏపీఎస్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తమ అధ్యయన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందించింది.
కమిటీ ఛైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి సహా కమిటీ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి నివేదిక అందించారు.
ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై రెండున్నర నెలల పాటు తాము చేసిన అధ్యయనాన్ని, పలు మార్గ దర్శకాలను సీఎం కు ఇచ్చే నివేదికలో పొందు పర్చినట్టు సమాచారం.
ఆర్టీసీ సంస్థ సహా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా నివేదిక ఇచ్చింది. విలీనం పై ఐదు రకాల ఉత్తమ విధానాలను ప్రాధాన్యాల వారీగా సిఫార్సు చేశారు.
డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు నష్టాలు వస్తున్నందున ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టడం పైనా కమిటీ నివేదిక ఇచ్చారు. బుధవారం జరిగే మంత్రి వర్గ భేటీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.