కొత్త అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్లను చెరో సగం వినియోగించుకునేందుకు ఇరు రాష్ట్రాల స్పీకర్లు అంగీకరించారు. మంత్రుల ఛాంబర్లను ఇరు రాష్ట్రాలు చెరో సగం ఉపయోగించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.
శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్పీకర్ల సమావేశంలో పార్టీలకు కార్యాలయాల కేటాయింపుపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్, ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి (ఇన్‌ఛార్జీ) కె. సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
పాత అసెంబ్లీ భవనంలోని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ మినహా మిగతావన్నీ ఖాళీ చేసేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించారు. గవర్నర్, తెలంగాణ స్పీకర్ ఇచ్చిన సూచనల పట్ల సానుకూలంగా స్పందించామని మీడియాకు ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద రావు తెలియజేశారు.