Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎగుమతిదార్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండ

ఎగుమతిదార్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండ
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:16 IST)
కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఎగుమతిదార్లు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, వివిధ రంగాల వారీగా ఆదుకోవాల్సిన అంశాల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) భవనంలో భారతీయ ఎగుమతి సంఘం సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్) తో  పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఎగమతిదార్లకు తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రజత్ భార్గవ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.  పలు పరిశ్రమలకు సంబంధించిన ఎగుమతిదార్లు తమ సమస్యలను రజత్ భార్గవకు వెల్లడించారు.

ప్రధానంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సరకు రవాణా, పెండింగ్ లో ఉన్న రాయితీలు, ప్రోత్సాహకాలు, కొరియర్ సర్వీస్, పోర్టుల్లో తలెత్తుతున్న సమస్యలు, విదేశాలకు ఇచ్చిన ఆర్డర్లు వెనక్కి రావడం, ముందుగా చెల్లించిన అడ్వాన్స్ లు,  వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), పెరుగుతున్న వడ్డీలు, విద్యుత్ ఛార్జీలు, కార్మికుల కొరత వంటి సమస్యలను ఎగుమతిదార్లు లేవనెత్తారు. 

అంతర్రాష్ట సరకు రవాణా సరఫరా విషయంలో సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సిందిగా కోరారు. కోవిడ్ -19 వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో 2014 నుంచి బకాయి పడిన రాయితీలు చెల్లిస్తే పరిశ్రమలకు చేయూతనిచ్చినట్లవుతుందని ఎగుమతిదార్లు కోరారు. 
 
ఎగుమతిదార్ల సమస్యలను సావధానంగా విన్న పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ పరిశ్రమల శాఖ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న  చర్యలను, ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవను వివరించారు.  సరకు రవాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పటికే ప్రత్యేక అనుమతులు జారీచేయడమే గాక నిబంధనలు సడిలించిన విషయం గుర్తుచేశారు.

సరకు రవాణా విషయంలో ఇంకేమైనా సమస్యలు తలెత్తితే తక్షణమే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ మేరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను ఇచ్చారు. అదే విధంగా ఎగుమతిదార్లకు ఏ సమస్య తలెత్తినా ఏ సమయంలో అయినా తనను సంప్రదించవచ్చని ధీమానిచ్చారు. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్మికుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకొని ఆయా పరిశ్రమలు కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ, భౌతిక దూరం పాటించేలా చేయగలిగితే షిప్టులవారీగా విధుల్లోకి తీసుకోవచ్చని సూచించారు. కార్మికుల భద్రతను పట్టించుకోకపోతే విధుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

గుంటూరు రెడ్ జోన్ లో ఉన్న కారణంగా స్థానిక పరిశ్రమల విషయంలో ఎలాంటి  నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం నిర్ణయం తెలియజేస్తామన్నారు. 2018-19 సంవత్సరంనకు గాను రూ.98,409 కోట్ల విలువ చేసే ఎగుమతులు చేసిందని గుర్తుచేశారు.

2019 తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే రూ.76 వేల కోట్ల విలువ చేసే ఎగుమతిని చేరుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష కోట్ల ఎగుమతులు జరిగాయన్నారు. ఈ గణాంకాలను కలకత్తాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెలువరించిందన్నారు.

పొగాకు పరిశ్రమకు సంబంధించిన ఒడిదుడుకులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించారన్నారు. రానున్న కొన్ని నెలల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలు(మత్స్య, ఉద్యాన, ఆగ్రో, కెమికల్ అండ్ ప్లాస్టిక్స్) కు సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఆదిశగా పనిచేస్తుందన్నారు.

కోవిడ్-19 నేపథ్యంలో ఇప్పటికే  అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూకే లాంటి దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయన్నారు. కోవిడ్-19 విభిన్న రకమైన వైరస్ అని దీన్ని సవాల్ గా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. కోవిడ్ వల్ల ఆర్థికంగా తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.

భారత తంతి తపాల శాఖ పూర్తిగా పనిచేస్తుందని ఈ నేపథ్యంలో అత్యవసర రవాణా (స్పీడ్ పోస్ట్) సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఎగుమతిదార్లకు సూచించారు. 
 
సరుకు ఎగమతిలో దక్షిణభారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉన్న విషయాన్ని పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎగుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలువురు ప్రశంసిస్తున్నారన్నారు. 

ఈ సందర్భంగా సహకరించిన ఎగుమతిదార్ల సేవలను కొనియాడారు. సహకారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించి ఎలా నడపాలన్న అంశంపై రేపు ముఖ్యమంత్రితో చర్చించి అనంతరం నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వివిధ ఎగుమతిదార్లు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా వెసులుబాటు కల్పిస్తుందని కొనియాడారు. 
 
వీడియాకాన్ఫరెన్స్ లో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.మురళి, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల సీఈవో పవన్ మూర్తి, ఎక్స్ పోర్ట్ అసోసియేషన్  ప్రెసిడెంట్, సీ ఫుడ్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , టెక్స్ టైల్స్,  గ్రానైట్, టొబాకో, ఫామ్, హెయిర్, స్పిన్నింగ్ మిల్స్, అగ్రో కమ్యూనిటీస్, గ్రీన్ ఏషియా, తదితర పరిశ్రమల ఎగుమతిదార్లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని శ్మశానంలో పడేసివెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. ఎక్కడ?