తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఉప ఎన్నిక ప్రచారంలో ముందుంది. ఆ పార్టీ అభ్యర్థి పనబాకలక్ష్మి ఎన్నికల ప్రచారంలోను కార్యకర్తలను దగ్గరకు చేర్చుకుని వారిని సమన్వయంతో ముందుకు నడిపించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా గూడూరు.. వెంకటగిరిలలోను, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు.. శ్రీకాళహస్తిలోను సమన్వయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు.
ఈ రోజు తిరుపతిలో కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసిన పనబాకలక్ష్మి వైసిపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకే ఒక్క ఎంపి పోరాటం చేస్తుంటే వైసిపికి చెందిన 22 మంది ఎంపిలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు పనబాకలక్ష్మి.
కేంద్రం మెడలు వంచి ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుంటామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్రమోడీ ఎందుకు హోదా ఇస్తామని తెలుగు ప్రజలకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా మార్పును గమనించాలని.. తిరుపతి ఎంపిగా తనను గెలిపించాలని పనబాలక్ష్మి కోరారు.