Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎపి రీసర్వే ప్రాజెక్టు దేశానికే ఆదర్శప్రాయం, మహారాష్ట్ర ఆస‌క్తి

Advertiesment
ap re survey project
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:06 IST)
దశాబ్దాల తరబడి పేరుకు పోయిన సర్వే సమస్యలకు పరిష్కారం చూపుతూ, అత్యాధునిక సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తున్న సమగ్ర భూసర్వే కార్యక్రమం అనుసరణీయమని మహారాష్ట్ర సర్వే సెటిల్ మెంట్ కమీషనర్, భూమి రికార్డుల సంచాలకులు నిరంజన్ కుమార్ సుదాంషు అన్నారు. దేశానికే ఆదర్శప్రాయంగా, సగటు రైతుకు ఉపయోగకరంగా వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష ప్రాజెక్టు అమలు చేయటం ముదావహమన్నారు. 
 
 
రాష్ట్రంలో అమలవుతున్న భూసర్వే ప్రాజెక్టును అధ్యయనం చేసే క్రమంలో మహారాష్ట్ర సర్వే విభాగం నుండి 11 మంది ఉన్నతాధికారులతో కూడిన బృందం గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తోంది. మంగళవారం జగ్గయ్యపేట సమీపంలో జరుగుతున్న భూసర్వే పనులను క్షేత్రస్దాయిలో పరిశీలించగా, సర్వే సెటిల్ మెంట్ , భూమి రికార్డుల కమీషనర్ సిద్దార్ధ జైన్ మహారాష్ట్ర బృందానికి ఇక్కడ అమలవుతున్న భూసర్వే ప్రాజెక్టు లోని విభిన్న అంశాలను వివరించారు.
 
 
ఈ సందర్భంగా నిరంజన్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేకించి గ్రామ స్ధాయిలో సర్వే విభాగం కోసం ఒక ఉద్యోగిని నిర్ధేశించటం, అక్కడే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయ్యేలా విధాన రూపకల్పన చేయటం చిన్నవిషయం కాదన్నారు. అంతర్జాతీయ స్దాయిలో వినియోగించే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఎటువంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమన్నారు. 
 
 
ఆంధ్రప్రదేశ్ సర్వే సెటిల్ మొంట్ కమీషనర్ సిద్దార్ధ జైన్ మాట్లాడుతూ  తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూసర్వే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 51 గ్రామాలలో  పూర్తి చేసామన్నారు. క్రయ విక్రయాలు జరిగిన మరుక్షణం రికార్డులు కూడా అప్‌డేట్‌ చేయటమే కాక, సర్వే డేటా భద్రతకు అవసరమైన చర్యలు కూడా ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్నాయన్నారు. సర్వే తదుపరి పూర్తి వివరాలతో కూడిన హక్కు పత్రాన్ని రైతులకు అందిస్తున్నామని సిద్ధార్ధ జైన్ మహారాష్ట్ర  బృందానికి వివరించారు. దేశంలోని పలురాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నభూసర్వే విధానాలను అధ్యయనం చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయన్నారు.
 
 
కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేటలో కాకినాడ ప్రాంతీయ ఉప సంచాలకులు కేజియా కుమారి ఎస్ఓపి మహారాష్ట్ర అధికారులకు వివరించారు. కార్స్ నెట్ వర్క్ గురించి కర్నూలు ప్రాంతీయ ఉప సంచాలకులు వెంకటేశ్వరరావు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి కేంద్ర కార్యాలయం ఉప సంచాలకులు ఝాన్సి రాణి, శిక్షణా కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ విఎస్ఎన్ కుమార్ , సాప్ట్ వేర్ పై ఎవిఎస్ ప్రసాద్, ఇతర అంశాలపై శ్రీనివాసులు రెడ్డి మహారాష్ట్ర బృందానికి వివరించారు. మహారాష్ట్ర అధికారులు సైతం సర్వేకు సంబంధించి ఆరాష్ట్రంలో అవలంభిస్తున్న విధానాలను విపులీకరించారు. విజయవాడలో పరిపాలనా విభాగపు సంయిక్త సంచాలకులు ప్రభాకర రావు, జగ్గయ్యపేటలో స్ధానిక సర్వే, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ స్కిల్ కాలేజీల్లో ఇంగ్లీష్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు