Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ పోలీస్‌ తొలి డ్యూటీ మీట్ ప్రారంభం

Advertiesment
AP Police‌
, సోమవారం, 4 జనవరి 2021 (12:17 IST)
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ తొలి డ్యూటీ మీట్‌ సోమవారం ప్రారంభమైంది. తిరుపతి ఎమ్మార్‌ పల్లి ఏఆర్‌ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు.

డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో ఈ నెల 7వ తేదీ వరకు ఈ మీట్‌ జరగనుంది. 13 జిల్లాల పోలీసు సిబ్బంది ఈ మీట్‌కు హాజరుకానున్నారు. క్రీడలు, ప్రతిభా పాటవాల ప్రదర్శనలతో పాటు ప్రత్యేకంగా సాంకేతికత, నేరాల తీరు, దర్యాప్తు తదితర నైపుణ్యాలపై అవగాహన కల్పించేలా సింపోజియంలు ఏర్పాటు చేశారు.

టెక్నాలజీ వినియోగంలో ఇప్పటికే దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ.. ఈ డ్యూటీ మీట్‌ సందర్భంగా అధునాతన టెక్నాలజీ కోసం పలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఆరో తేదీన మహిళలకు రక్షణ కార్యక్రమాలను రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించనున్నారు. 
 
35 కంపెనీలు : పోలీస్‌ డ్యూటీ మీట్‌లో ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రజల సందర్శనకు అనుమతిస్తున్నాం. పోలీస్‌ టెక్నాలజీ ఇండస్ట్రీస్‌కు చెందిన 35 కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. అవి రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలను ప్రదర్శనకు ఉంచుతాయి.

దిశ, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ వంటి ఏపీ పోలీస్‌ శాఖకు చెందిన వాటి కోసం మరో 16 ప్రదర్శన (డెమో) స్టాల్స్‌ ఏర్పాటు చేస్తాం. 51 స్టాల్స్‌ను ప్రజలు స్వయంగా వచ్చి పరిశీలించేందుకు అనుమతిస్తాం. ఆయా స్టాల్స్‌లో సందర్శకులకు అవగాహన కల్పించేలా పోలీస్‌ సిబ్బంది ఉంటారు.
 
ఆరేళ్ల తర్వాత :
ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ డ్యూటీ మీట్‌ను పోలీస్‌ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఏటా నిర్వహించాల్సి ఉన్నా.. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని  ప్రభుత్వం తొలిసారిగా పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహించడం విశేషం.
 
200 మంది పోలీస్‌ ప్రతినిధులు :
డ్యూటీ మీట్‌తో పాటు నిర్వహించే సింపోజియం తదితర కార్యక్రమాలకు రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్ల నుంచి ప్రతినిధులను ఎంపిక చేశారు. ఎస్సై నుంచి ఐపీఎస్‌ కేడర్‌ వరకు 200 మంది ఈ కార్యక్రమాలకు హాజరౌతారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సింపోజియంలు, ఒప్పందాలు, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్వాట్స్‌ బృందాలు ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో భార్యను కడతేర్చాడు.. ఆపై తీరతో ఉరి వేశాడు