Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే.. మంత్రి యనమల, బిల్డర్ల గోడు

అమరావతి : ఒక్కసారిగా పెరిగి ప్రజలకు భారంగా మారిన సిమెంట్ ధర సమస్యకు పరిష్కారం కావాలని సిమెంట్ ఉత్పత్తిదారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం రెండవ బ్లాక్ లో సోమవారం మధ్యాహ్నం సిమెంట్ ఉత్పత్తిదారులు మంత్రి మండలి ఉపసంఘంతో సమావేశమయ్యార

సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే.. మంత్రి యనమల, బిల్డర్ల గోడు
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (21:28 IST)
అమరావతి : ఒక్కసారిగా పెరిగి ప్రజలకు భారంగా మారిన సిమెంట్ ధర సమస్యకు పరిష్కారం కావాలని సిమెంట్ ఉత్పత్తిదారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం రెండవ బ్లాక్ లో సోమవారం మధ్యాహ్నం సిమెంట్ ఉత్పత్తిదారులు మంత్రి మండలి ఉపసంఘంతో సమావేశమయ్యారు. సిమెంట్ బస్తా ధర ఒక్కసారిగా 70 నుంచి 90 రూపాయలు పెరగడం, అలాగే జిల్లా జిల్లాకు ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసే సీఫామ్ ద్వారా అమ్మే సిమెంట్ బస్తా ధరకు, సాధారణ  మార్కెట్ ధరకు రూ.40ల వరకు వ్యత్యాసం ఉంటుంది. 
సిమెంట్ ఉత్పత్తిదారులతో సమావేశమైన మంత్రులు నారాయణ, అమరనాథ రెడ్డి, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్.
 
ఈ ఏడాది జూలై 1 నుంచి జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్- వస్తుసేవల పన్ను) అమలులోకి వస్తుంది. దాంతో సీఫామ్ ద్వారా సిమెంట్ అమ్మకానికి ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడంలేదు. జీఎస్టీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పన్ను రాయితీ  ఇవ్వదేమోనన్న అనుమానాలు వారికి ఉన్నాయి.  ఈ విషయంలో ఆర్థిక మంత్రి యనమల వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. జూన్ నెలాఖరువరకు ప్రభుత్వం సీఫారాలు జారీ చేస్తుందని, ఉత్పత్తిదారులు సిమెంట్ సరఫరా చేయాలని, దాని వల్ల జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మంత్రులుగా తాముగానీ, ప్రభుత్వంగానీ ప్రజల మేలు కోసం పని చేస్తామన్నారు. ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత తమకు ఉందని చెప్పారు. 
 
అదే సందర్భంలో పరిశ్రమలు కూడా బాగుండాలనే అనేక రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తిదారులకు ఉండే సమస్యలు వారికీ ఉంటాయని, కాదనడంలేదన్నారు.  సీఫామ్ లు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం రూ.60 నుంచి రూ.70 కోట్ల   నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నందున ఉత్పత్తిదారులు కూడా లాభాల్లో ఒక శాతం తగ్గించుకొని సిమెంట్ ధర తగ్గించాలన్నారు. నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు డీలర్లు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో సిమెంట్ బస్తా ధర ఒకే రకంగా ఉండాలని, ఒక వేళ వ్యత్యాసం ఉన్నా రవాణా చార్జీలకు మించి ఉండకూడదని మంత్రి యనమల చెప్పారు. 
 
తమ నిర్ణయం తెలపడానికి  ఉత్పత్తిదారులు రెండు రోజులు సమయం అడిగారు. తాము చర్చించుకొని నిర్ణయం తెలియజేస్తామన్నారు. ధర మాత్రం తగ్గించాలని మంత్రులు డిమాండ్ చేశారు. మళ్లీ ఈ నెల 27వ తేదీ సాయంత్రం సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు ఇతర మంత్రులు నారాయణ, అమరనాథ రెడ్డి, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కుటుంబరావు పాల్గొన్నారు. 
 
బాధలు చెప్పుకున్న బిల్డర్లు
ఉత్పత్తిదారులతో సమావేశం ముగిసిన తరువాత మంత్రులు బిల్డర్లతో కూడా సమావేశమయ్యారు. వారు తమ ఇబ్బందులను చెప్పారు. మార్చిలో కొన్ని బ్రాండ్ల సిమెంట్ బస్తా రూ.235లకే ఇచ్చారని, ఇప్పుడు రూ.370 రూపాయల వరకు అమ్ముతున్నారని వారు తెలిపారు. ప్రస్తుతం సీఫామ్ పై ఎవరూ సిమెంట్ అమ్మడంలేదని చెప్పారు. సిమెంట్ ధరలు ఈ స్థాయిలో పెరగడంతో ఇప్పటికే తాము అంగీకరించిన వాటిని పూర్తి చేసి ఇవ్వడం కష్టమని వారు తమ బాధలు వివరించారు. అడిగినవారందరికి సీఫామ్స్ ఇస్తారని, వాటిపై కంపెనీలు సిమెంట్ కూడా పంపిణీ చేస్తారని, రెండు రోజుల్లో ధరలు తగ్గుతాయని మంత్రి యనమల వారికి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచికి ఆంధ్రప్రదేశ్ చిరునామా... మోసగాళ్ల తాటతీస్తాం... సీఎం చంద్రబాబు