ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైపాకా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత బంధువులను సైతం మోసం చేశారు. తాజాగా ఏపీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ఉషశ్రీ భర్త శ్రీచరణ్ సొ మేనత్తనే మోసం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కేవీ ఉష భర్త శ్రీచరణ్ తమను మోసం చేశారని ఆయన మేనమామ జగన్నాథ్ భార్య నాగవేణి ఆరోపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో నాగవేణి మాట్లాడుతూ కర్ణాటకలోని యలహంక పరిధిలో ఉన్న సింగనాయకనహళ్లికి చెందిన జగన్నాథ్ సోదరి కుమారుడైన శ్రీచరణ్ తన మేనమామతో 'మీ ఇంటి వెనక స్థలం కొన్నా.. 30 అడుగుల దారి ఇవ్వండ'ని నమ్మించి ఇంటితో సహా మొత్తం స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు.
చిన్నతనంలో తండ్రి ప్రమాదంలో మరణిస్తే ఆదరించి పెంచి పెద్ద చేసిన అత్తమామలనే మోసం చేసిన దుర్మార్గుడు శ్రీచరణ్ అని ఆమె ఆరోపించారు. మంత్రిగా ఉన్న ఉష ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేదని, ఇల్లు రాయించుకున్నాక ఖాళీ చేయాలని వేధించారని ఆరోపించారు. మేనల్లుడు నమ్మించి మోసం చేయడంతో మనస్తాపం చెందిన జగన్నాథ్ బ్రెయిన్‌స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్నారని వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు.