ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యా మంత్రి నారా లోకేశ్ మరో శుభవార్త చెప్పారు. జనవరిలో మరో డీఎస్సీని నోటిఫికేషన్‌ను రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించేలా దృష్టిసారించినట్టు ఆయన వెల్లడించారు.
ముఖ్యంగా, ప్రతిసారీ డీఎస్సీ నోటిఫికేషన్‌కు అడ్డంకిగా మారుతున్న న్యాయ వివాదాలకు ఈసారి ఫుల్ స్టాప్ పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, త్వరలో నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనల్లో భారీ మార్పులు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, టెట్ అర్హతలను పూర్తిగా జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి (ఎన్.టి.ఈ.సీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించనట్టు తెలిపారు.
గతంలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలైన ప్రతిసారీ అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు వంటి అంశాలపై కోర్టు కేసులు దాఖలవుతూ నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, ఈసారి టెట్ నోటిఫికేషన్ నుంచే ఎన్టీఈసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించనున్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నియామక ప్రక్రియ సజావుగా సాగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించినట్లుగా, జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నోటిఫికేషనులో సుమారు 2000 పోస్టులు ఉండే అవకాశం ఉంది.
ఇందులో స్పెషల్ డీఎస్సీ కింద 1000 పోస్టులు, మెగా డీఎస్సీ-2025లో మిగిలిపోయిన 406 పోస్టులతో పాటు, ఈ యేడాది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ఖాళీలను కూడా కలపనున్నారు. పోస్టుల భర్తీలో విద్యార్థుల సంఖ్యను కూడా ప్రామాణికంగా తీసుకోనున్నారు.