తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మంత్రి నాని విలేకరులతో మాట్లాడుతూ.. నాడు ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడే చంద్రబాబును జైలుకు పంపించి అంతమొందించి ఉండాల్సిందన్నారు.
అలా జరిగి ఉంటే గుంటూరు లాంటి సంఘటనలు ఇప్పుడు జరిగేవి కాదన్నారు. ఎస్సీ మహిళ శవాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పనిలోపనిగా నారా లోకేశ్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాకానుక కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు లోకేశ్ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయాలన్నదే ప్రభుత్వం అభిమతమని, అందుకనే దిశ చట్టం, యాప్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. గుంటూరు యువతిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్టు చేశారని, ఏపీ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తుంటే వారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.