విద్యుత్ శాఖామంత్రి కళా వెంకట్రావ్ తొలి సంతకం... 50 వేల మంది రైతుల కోసం....
వెలగపూడి : అంతరాయంలేని, నాణ్యమైన విద్యుత్ అందించే రాష్ట్రంగా ఏపీని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటల 15 నిముషాలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విద్య
వెలగపూడి : అంతరాయంలేని, నాణ్యమైన విద్యుత్ అందించే రాష్ట్రంగా ఏపీని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమని విద్యుత్ శాఖా మంత్రి కిమిడి కళా వెంకట్రావ్ ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటల 15 నిముషాలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆయన విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు జరిగిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలోని 50 వేల మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించి.. ఆ ఫైల్ పైన తొలి సంతకం చేశారు.
అలాగే పోలవరం ప్రాజెక్టులో భాగంగా 900 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కార్యక్రమానికి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం చేశారు. పంజాబ్ లోని భాక్రానంగల్ ప్రాజెక్టు దేశంలోని మొట్టమొదటి బహుళార్ధక ప్రాజెక్టు అయితే.. పోలవరం రెండో భారీ బహుళార్ధక ప్రాజెక్టుగానే కాక.. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ఆనందించదగ్గ విషయమని.. ఈ ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మంత్రిని చేసి, ముఖ్యమంత్రి వద్ద ఉన్న కీలకమైన విద్యుత్ శాఖను తనకు కట్టబెట్టినందుకు.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటానని ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ.. ఆయన చేస్తున్న కృషికి వెన్నెముకగా నిలుస్తామని చెప్పారు. నాణ్యమైన, నిరంతర విద్యుత్ ను అందించడం ద్వారా.. పారిశ్రామికరంగాన్ని ఆకర్షించి.. భారీ సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పేలా చేస్తామన్నారు. ఐటీ, పంచాయతిరాజ్ శాఖామంత్రి లోకేష్ బాబు ఇప్పటికే తనకెంతో సహకారం అందిస్తున్నారని.. మిగిలిన మంత్రుల సహకారం కూడా తీసుకుని.. విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సుస్థిర విద్యుత్ తో నవ్యాంధ్రకు నవ్య కాంతి.. ప్రగతి ఫలాలన్నీ ప్రజలకే అంకితం.. అంటూ రూపొందించిన బ్రోచర్ ను మంత్రి కళా వెంకట్రావ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్సీలు టి.డి.జనార్ధన్, వి.వి.వి.ఎస్.చౌదరి, బుద్దా వెంకన్నలతో పాటు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఎస్ పిడిసిఎల్ సీఎండి దొర, నెడ్ క్యాప్ ఎం.డి కమలాకర్ బాబు.. పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.