ఏపీ పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు పార్టీలకు తొత్తులుగా మారితే చర్యలు తప్పవని మంత్రి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ప్రజలకు సేవలు అందించాలని.. ఎక్కడైనా ఏకపక్షంగా వ్యవహరించారని తేలితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులను బెదిరింపులకు గురిచేసి గత ప్రభుత్వం పాలనా వ్యవస్థను భ్రష్టుపట్టించిందని అన్నారు.
విజయవాడ జిల్లా జైలును హోం మినిస్టర్ వంగలపూడి అనిత సోమవారం తనిఖీ చేశారు. జిల్లా జైలులో గంజాయి సరఫరా అవుతుందన్న ఆరోపణలను హోం మంత్రి పరిశీలించారు. జైలు అధికారులపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. రెండు రోజుల్లో నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
వైసీపీ నేతల తప్పులు బయటపడుతున్నాయని విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. కాకినాడ పోర్ట్‌లో అవినీతి గురించి విచారణ జరుగుతుందని రేషన్ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.