గుంటూరు జిల్లాలోని ప్రముఖ సంగం డెయిరీ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంగం డెయిరీ స్వాధీనంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
పైగా, సంగం డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు సూచించింది. అయితే, సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని ధూళిపాళ్ల న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకి కరోనా సోకటంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని కోర్టుకు సీఐడీ అధికారులు వెల్లడించారు.
కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టునే విచారణ చేయమని హైకోర్టు తెలిపింది. సంగం డెయిరీ సమాచారాన్ని.. ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని పిటిషనర్లు కోర్టుకి తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 17కు వాయిదా వేసింది. దీంతో జగన్ సర్కారు మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.