ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే అధికారులు ఆ రాష్ట్ర హైకోర్టు చేతిలో పదేపదే చీవాట్లు తింటున్నారు. తమ ఆదేశాలను అమలు చేయాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. దీంతో హైకోర్టు చేతిలో మొట్టికాయలు తినడమేకాకుండా జైలుశిక్షలను కూడా అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నంకాలేదు. కానీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికారులు హైకోర్టుతో చీవాట్లు తినడం ఎక్కువైపోయింది. తాజాగా ఇద్దరు అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పులను అమలు చేయలేదని ఆక్షేపిస్తూ వీరికి జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పును బుధవారం తీర్పునిచ్చింది. శిక్షపడిన ఇద్దరు అధికారులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అంశాలకు సంబంధించిన విషయంపై ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు ఆలకించిన తర్వాత హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కానీ, హైకోర్టు తీర్పును అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై బుధవారం మరోమారు వాదనలు జరిగాయి.
ఇదివరకే ఇచ్చిన కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పును అమలు చేయని కారణంగా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఇంటర్ బోర్డు కమిషనర్ రామకృష్ణలకు నెల రోజుల పాటు జైలుశిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. పైగా, ఇద్దరు అధికారులను తక్షణం అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.